తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ మాజీ ఎంపీ మూర్తి మనవడు శ్రీభరత్... స్వల్ప ఓట్ల తేడాతో ఎంపీ పదవిని చేజార్చుకున్న విషయం తెలిసిందే. విశాఖ ఎంపీగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి శ్రీభరత్, వైసీపీ అభ్యర్థి సత్యనారాయణ, జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ మధ్య పోటీ రసవత్తరంగా సాగింది. జనసేన తరపున పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు భారీగానే ఓట్లు వచ్చినప్పటికీ... ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మధ్యే సాగింది. చివరివరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోటీలో వైసీపీ అభ్యర్థి సత్యనారాయణ టీడీపీ అభ్యర్థి శ్రీభరత్పై 4,400 పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
గుంటూరు జిల్లాలో జరిగిన పార్టీ సమీక్షా సమావేశానికి హాజరైన శ్రీభరత్... తన ఓటమికి కారణం ఏంటనే విషయాన్ని మీడియాకు వివరించారు. త్రిముఖ పోరు, క్రాస్ ఓటింగే తన ఓటమికి కారణమని భరత్ అన్నారు. జేడీ లక్ష్మీనారాయణ ఆ స్థాయిలో ఓట్లను చీలుస్తారని ఊహించలేదని తెలిపారు. తన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని...అవన్నీ తనకు గుణపాఠమే అని వ్యాఖ్యానించారు. పార్టీ ఆదేశిస్తే మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
తక్కువ ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యానన్న శ్రీభరత్... తాను ఓడినా ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ సారి ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికల బరిలోకి దిగిన బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్లు ఓటమిపాలయ్యారు. పెద్దల్లుడు నారా లోకేశ్ మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓటమి పాలవ్వగా... చిన్నల్లుడు శ్రీభరత్ విశాఖ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే రెండోసారి హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాలకృష్ణ మాత్రం అనూహ్యంగా వైసీపీ హవాను తట్టుకుని విజయం సాధించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.