సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై ఏపీలో దుమారం రేగుతోంది. డిక్లరేషన్ అవసరం లేదని అధికార పార్టీ నేతలు చెబుతుంటే... అన్యమతానికి చెందిన సీఎం జగన్.. డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టుతున్నాయి. ఈ వ్యవహారంపై హైదరాబాద్‌లోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. తిరుమల డిక్లరేషన్‌తో పాటు హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసం ఎదుట భజ్రంగ్ దళ్ ఆందోళనకు దిగింది. హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగన్ నివాసం ముట్టడికి పిలుపునివ్వడంతో ముందుజాగ్రత్తగా లోటప్‌పాండ్‌లో భారీగా పోలీసులు మోహరించారు.
జగన్ నివాసానికి 200 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఐతే ఒక్కసారిగా భజ్రంగ్ దళ్ కార్యకర్తలు దూసుకు రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తతల మధ్యే ఆందోళనకారులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు పోలీసులు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం తిరుమలలో పర్యటించేందుకు సీఎం జగన్‌కు డిక్లరేషన్ అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పర్యటించినప్పుడు అవసరం లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ, బీజేపీ నేతలు కావాలనే ఉద్దేశ్వపూర్వకంగా సీఎం జగన్ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల ఏపీమంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించాలని.. లేదంటే ఆయన వ్యాఖ్యలకు సీఎం జగనే బాధ్యత వహించాలని మండిపడుతున్నారు. ఏ గుడికి, మసీదుకి, చర్చిలకి లేని డిక్లరేషన్.. తిరుమల పుణ్యక్షేత్రంలో మాత్రం ఎందుకు ఉందని కొడాలి నాని రెండు రోజుల క్రితం అన్నారు. శ్రీవారి ఆలయంలోకి సంతకం పెట్టకుండా వెళ్తే తిరుమల అపవిత్రం అవుతుందా అని ప్రశ్నించారు. అసలైన హిందూవాదుల నుంచి ఏ అభ్యంతరాలు లేవని.. విపక్షాలే అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. డిక్లరేషన్ అనేది కేవలం రాజకీయ పార్టీల పెద్దలు తెచ్చిన విధానమేనని ఆయన పేర్కొన్నారు. అందుకే ఆ విధానం తీసేయాలని స్పష్టం చేశారు మంత్రి కొడాలి నాని. ఈ నేపథ్యంలో ఆయన తీరుపై భజ్రంగ్ దళ్‌తో పాటు టీడీపీ, బీజేపీ పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.