విశాఖలో కరోనా లెక్కలు దాయడానికి కారణం ఇదే... అయ్యన్నపాత్రుడు ఆరోపణలు

ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి , ఏపీ గవర్నర్ , హైకోర్టు న్యాయమూర్తి సమగ్రమైన విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు తెలపాలని అయ్యన్నపాత్రుడు కోరారు.

news18-telugu
Updated: April 17, 2020, 6:02 PM IST
విశాఖలో కరోనా లెక్కలు దాయడానికి కారణం ఇదే... అయ్యన్నపాత్రుడు ఆరోపణలు
ఏపీ సీఎం వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ రాజధానిని విశాఖకు మార్చేందుకు విశాఖలో కరోనా ప్రభావం లేదని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రజలంతా భావిస్తున్నట్టు చెప్పారు. అదే నిజమైతే మిమ్మల్ని భగవంతుడు కూడా క్షమించడంటూ శాపం పెట్టారు. ప్రజల జీవితాలతో ఆటలాడుకోవద్దని అయ్యన్నపాత్రుడు సూచించారు. వాస్తవాలు చెప్పాలని కోరారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులైనా వాస్తవాలు చెప్పాలన్నారు. ప్రజలను మోసం చేస్తే పుట్టగతులు లేకుండా పోతారని హెచ్చరించారు. ‘విశాఖ నగరంలో రోజు రోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు విశాఖలో కేసులు లేవని తప్పుడు ప్రచారం చేస్తున్నది నిజం కాదా?. అన్ని వర్గాల ప్రజలు, ఆఖరికి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇది వాస్తవమే అంటున్నారు. వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మీ స్వార్థ ప్రయోజనాల కోసం కరోనా వ్యాప్తి వివరాలు దాస్తే విశాఖ మాత్రమే కాదు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది.’ అని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం అసలు కరోనా వ్యాధే లేదు, కేసులు పెరగడం లేదని ప్రజలను మోసం చేయడం సరికాదన్నారు. వాస్తవాలు దాయడం వల్ల రాష్ట్రానికి, ప్రజలకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు. వాస్తవాలు చెప్పకపోతే వ్యాధి రోజురోజుకు పెరుగుతుందన్నారు. కరోనాపై అసలైన లెక్కలతో బులిటెన్ విడుదల చేయాలని అయ్యన్నపాత్రుడు కోరారు. లాక్ డౌన్ వల్ల పేదలు, కూలీలు ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల గురించి ఆలోచించాలని, ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సాయం అందించాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. ఆపద సమయంలోనూ వైసీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి , ఏపీ గవర్నర్ , హైకోర్టు న్యాయమూర్తి సమగ్రమైన విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు తెలపాలని కోరారు.
First published: April 17, 2020, 5:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading