HOME »NEWS »POLITICS »atchannaidu verbal attack on ap cm ys jagan over gitam university encroachment issue ba gnt

Atchannaidu: సీఎం అయినప్పటి నుంచి ఈ నాలుగు పనులే చేస్తున్న జగన్: అచ్చెన్నాయుడు

Atchannaidu: సీఎం అయినప్పటి నుంచి ఈ నాలుగు పనులే చేస్తున్న జగన్: అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు, సీఎం జగన్

జగన్ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో విధ్వంసాలు, అవినీతి, అక్రమ కేసులు, కూల్చటాలే ఏకైక కార్యక్రమంగా పెట్టుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో విధ్వంసాలు, అవినీతి, అక్రమ కేసులు, కూల్చటాలే ఏకైక కార్యక్రమంగా పెట్టుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గీతం యూనివర్సిటీ ప్రహరీగోడల కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గతంలో ఉత్తరాంధ్రలో సరైన విద్యా సంస్థలు లేక విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లారని, వెనకబడ్డ ఉత్తరాంధ్రలో గాంధీ స్ఫూర్తితో గీతం యూనివర్సిటీ ఏర్పడిందని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర విద్యార్థులతో పాటు రాష్ట్రం, దేశంలోని వేల మంది విద్యార్థులు గీతం యూనివర్సిటీలో చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. కోవిడ్ తో ఎన్నో సంస్థలు ఉద్యోగాలు తీసేసినా గీతం సంస్థ ఉద్యోగ భధ్రత కల్పించి జీతాలు అందించిందన్నారు. అలాంటి యూనివర్సిటీపై ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండి పడ్డారు. జగన్ లాగా భారతీ సిమెంటు కంపెనీ పెట్టి నీరు, భూమి దోచుకోవడానికి గీతం సంస్థ పెట్టలేదని ఎద్దేవా చేశారు. అర్థరాత్రి గోడలు కూల్చాల్సిన అవరసం ఏంటని ప్రశ్నించారు.

  ‘పోలీసులను పెట్టి ఎవరూ లేని సమయంలో కూల్చడం ఎంత వరకు సబబు? అభివృద్ధి, ఆదాయం, సంక్షేమం పట్టించుకోకుండా విధ్వంసంపై దృష్టి పెట్టారు. సోదరభావంతో ఉన్న ఉత్తరాంధ్రలో అలజడి సృష్టిస్తున్నారు. విద్యార్థులు, ప్రజలు మేల్కొకపోతే రాష్ట్రాన్ని, ఉత్తరాంధ్రను ఎవరూ కాపాడలేరు. టీడీపీ సానుభూతి పరుల ఆస్తుల తప్ప జగన్ కంటికి ఎవరూ కనబడటం లేదు. కనపడిన భూమినల్లా కబ్జా చేసకుంటూ వైసీపీ నాయకులు రాష్రాన్ని దోచుకుంటున్నారు. వైసీపీ చేసే తప్పులను ప్రజలు క్షమించరు. వీళ్లు చేసే తప్పులకు త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలకు గీతం సంస్థలు వేదికగా ఉన్నాయి. హుద్ హుద్ సమయంలో ప్రజలు తలదాచుకున్నారు. కరోనాతో విశాఖ ప్రజలు భయపడుతుంటే మొదటి సారి వాలంటీర్ గా కోవిడ్ సేవలు అందించారు’ అని వివరించారు.  విశాఖ గీతం యూనివర్సిటీలోని కొన్ని కట్టడాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూములు అక్రమించి ఈ నిర్మాణాలు చేపట్టారని.. యూనివర్సిటీ ప్రహరీ గోడ (కొంత భాగం), ప్రధాన ద్వారాన్ని అధికారులు కూలగొట్టారు. ఈ క్రమంలో యూనివర్సిటీ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. కూల్చివేత బీచ్ రోడ్డు మీదుగా యూనివర్సిటీ వైపు వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు. యూనివర్సిటీ పరిసరాల్లోకి అధికారులు ఎవరిని అనుమతించ లేదు. అయితే నోటీసులు ఇవ్వకుండానే అధికారులు నిర్మాణాలను కూల్చివేస్తున్నారని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆరోపిస్తుంది. ముందస్తు సమాచారం లేకుండా ఈ విధంగా చేయడం సరైనది కాదని పేర్కొంది. ఇందుకు సంబంధించి న్యాయపరమైన అంశాలు కోర్టులో ఉన్నాయని తెలిపింది. అయితే రిషికొండ, ఎండాడ పరిధిలో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీ అక్రమించినట్టుగా విచారణలో తేలిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తాము ఐదు నెలల క్రితమే నోటీసులు జారీ చేశామని చెబుతున్నారు. గతంలో విశాఖలో టీడీపీ నేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టారంటూ సబ్బంహరి, మరికొందరు నేతల ఇళ్ల గోడలను అధికారులు కూల్చి వేశారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:October 24, 2020, 16:24 IST