Atchannaidu: చంద్రబాబుపై అచ్చెన్నాయుడు అసంతృప్తి?

AP TDP President: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడును చంద్రబాబు ఎంపిక చేశారని, పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు ఆయనవైపు మొగ్గుచూపారని ఇటీవల ప్రచారం జరిగింది.

news18-telugu
Updated: September 30, 2020, 2:22 PM IST
Atchannaidu: చంద్రబాబుపై అచ్చెన్నాయుడు అసంతృప్తి?
అచ్చన్నాయుడు (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అలక వహించినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకు చంద్రబాబు వైఖరే కారణమనే వాదన వినిపిస్తోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడును చంద్రబాబు ఎంపిక చేశారని, పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు ఆయనవైపు మొగ్గుచూపారని ఇటీవల ప్రచారం జరిగింది. అచ్చెన్నాయుడు పేరున ఈనెల 27న ప్రకటిస్తారని భావించారు. అయితే, అందుకు ఒక్కరోజు ముందు సడన్‌గా మరో పేరు తెరపైకి వచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన మరో బీసీ నేత బీద రవిచంద్ర యాదవ్ పేరును కూడా కొందరు ప్రతిపాదించారని, దీంతో చంద్రబాబు డైలమాలో పడ్డారని సమాచారం. దీనిపై అచ్చెన్నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. పార్టీలో మెజారిటీ వర్గం తనకు పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత కూడా చంద్రబాబునాయుడు ఇంకా ఆలోచించడం అచ్చెన్నాయుడు అలకకు కారణంగా తెలుస్తోంది. ఈనెల 27వ తేదీన పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులను ప్రకటించారు చంద్రబాబు. అది జరిగిన మూడు రోజుల తర్వాత కూడా ఇప్పటికీ తన పేరును ప్రకటించకపోవడంతో అచ్చెన్నాయుడు ఇంకా ఎదురుచూపులు చూస్తున్నారు.

అచ్చెన్నాయుడు, బీద రవిచంద్ర యాదవ్ ఇద్దరూ బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలే. ఒకరు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన వారు. మరొకరు దక్షిణ కోస్తాకు చెందిన నేత. అచ్చెన్నాయుడు ప్రస్తుతం టీడీపీ శాసనసభాపక్ష ఉప నేతగా కూడా ఉన్నారు. రవిచంద్ర యాదవ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే, ఇటీవల అచ్చెన్నాయుడు మీద ఈఎస్ఐ కేసు నమోదైంది. ఆయన్ను ఏసీబీ అరెస్టు చేసింది. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన అచ్చెన్నాయుడు దాదాపు రెండు నెలల తర్వాత ఆస్పత్రి నుంచి రిలీజ్ అయ్యారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడును ఏపీ ఏసీబీ అరెస్టు చేస్తే తర్వాత పరిస్థితి ఏంటనే దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ టీడీపీకి మరో వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.

బీద రవిచంద్ర యాదవ్


ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద అచ్చెన్నాయుడు తన వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. వైఎస్ జగన్ సర్కారు మీద దూకుడుగా ఉంటారు. జగన్ మీద అవినీతి ఆరోపణలను కూడా అచ్చెన్నాయుడు బలంగా వినిపిస్తారు. మరోవైపు టీడీపీలో పనిభారం దృష్ట్యా ప్రధాన కార్యదర్శులు మరికొందరు కూడా ఉండబోతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అనేక పేర్లు పరిశీలనకు వచ్చినా చివరకు అచ్చెన్నాయుడు పేరుకే సీనియర్లు ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది.

Chandrababu naidu, Undavalli Karakatta, Krishna Flood water, Prakasam barrage, చంద్రబాబు నాయుడు, ఉండవల్లి కరకట్ట, కృష్ణా వరద నీరు, ప్రకాశం బ్యారేజ్
చంద్రబాబు నాయుడు


ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడును నియమిస్తే బీసీల్లో కోల్పోయిన పట్టును మళ్లీ సాధించవచ్చని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా వీలైనంత త్వరగా పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు. అచ్చెన్నాయుడు 2009 ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో టెక్కలి నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. బీద రవిచంద్ర యాదవ్ నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, టీడీపీ MLCగా ఉన్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 30, 2020, 2:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading