కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ అధికారిక నివాసం 5-సఫ్దర్ గంజ్ లేన్‌కు వెళ్లారు. మంగళవారం రాత్రి వారిద్దరూ మరో చోట సమావేశం కావాల్సి ఉంది. అయితే, దేవెగౌడ నివాసానికి వచ్చి కలుస్తానని రాహుల్ గాంధీ చెప్పడంతో ఆ భేటీ వాయిదా పడింది. ఓ రకంగా తాము జేడీఎస్‌తో స్నేహం కోసం ఓ అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నామని సందేశాన్ని పంపారు. కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచి ఒడిదొడుకులను ఎదుర్కొంటూనే ఉంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి ఇప్పటికే ఐదారుసార్లు బీజేపీ ప్రయత్నాలు చేసింది. అయితే, ఈ కలయిక రెండు పార్టీల మధ్య కూడా కొంత అసంతృప్తికి గురి చేసింది. పది జిల్లాల దక్షిణ కర్ణాటకలోని ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో ఆ రెండు పార్టీల మధ్య విబేధాలు ఉన్నాయి.
సీఎం కుమారస్వామి(File)
వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంపై స్థానిక నేతలు ఇప్పటి వరకు చర్చించారు. అయితే, ఆ చర్చలు కొలిక్కి రాలేదు. మరోవైపు ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుండడంతో మాజీ ప్రధాని దేవెగౌడ ఢిల్లీలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించి ఓ ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని భావించారు. తాము పది సీట్లు అడుగుతున్నామని త్వరలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే, జేడీఎస్‌కు ఆరు సీట్లకు మించి ఎక్కువ ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు.
రాహుల్‌గాంధీతో కుమారస్వామి
కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అందులో కాంగ్రెస్‌కు 10, జేడీఎస్‌కు ఇద్దరు సభ్యులున్నారు. బీజేపీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. జేడీఎస్ సిట్టింగ్ ఎంపీలు ఉన్న మాండ్యా, హసన్ నియోజకవర్గాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. అయితే, పది సీట్లు ఇచ్చేందుకు మాత్రం ససేమిరా అంటోంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీలు ఉన్న తుమ్కూర్, చిక్కబళ్లాపూర్ లోక్‌సభ నియోజకవర్గాలను తమకు ఇవ్వాలని అడుగుతున్నారు దేవెగౌడ. తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కోసం ఆయన తన కంచుకోట లాంటి హసన్ నియోజకవర్గాన్ని ఇచ్చేశారు. మరో మనవడు నిఖిల్ గౌడ కోసం మాండ్యా నియోజకవర్గాన్ని ఖరారు చేశారు. ఇప్పుడు తాను 15వ సారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తుమ్కూర్ లేదా చిక్కబళ్లాపూర్ నియోజకవర్గాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలని భావిస్తున్నారు. అయితే, అందుకు కర్ణాటక కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఆయన బెంగళూరు నార్త్ నియోజకవర్గంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని ఓ కీలక నేత చెప్పారు.
యడ్యూరప్ప, అమిత్ షా
దేవెగౌడ ఇప్పటికే మైసూర్ -కొడగు సీటు మీద దృష్టి పెట్టారని సమాచారం. అయితే, ఆయనకు మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య చెక్ పెడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ బరిలో నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు. నేతల మధ్య ఇగోలు, వ్యక్తిగత విబేధాల వల్ల రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం కఠినంగా మారింది. దీని వల్ల బీజేపీకి లబ్ధి చేకూరనుంది.
కర్నాటక అసెంబ్లీ భవనంలో లంచ్ చేస్తున్న యడ్యూరప్ప, సిద్దరామయ్య. పక్కనే నిలబడి ఉన్న సీఎం కుమారస్వామి (File)
కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమాచారం ప్రకారం హసన్, మాండ్యాతోపాటు షిమోగా, ఉత్తర కన్నడ, విజయపుర నియోజకవర్గాలను ఇచ్చేందుకు హస్తం నేతలు రెడీ అయ్యారు. ఒకవేళ జేడీఎస్ గట్టి అభ్యర్థులను బరిలోకి దింపితే మైసూర్ - కొడగు, బెంగళూరు నార్త్, దావణగెరె సీట్లు ఇచ్చేందుకు కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, జేడీఎస్‌కు పది సీట్లు ఇచ్చినా ఆ పార్టీకి సరైన అభ్యర్థులు కూడా లేరని కర్ణాటక కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘జేడీఎస్ కేవలం ఐదు సీట్లలో గట్టి పోటీ ఇవ్వగలదు. వాళ్లు వాస్తవానికి దగ్గరగా ఉండాలి. వాళ్లకి పది సీట్లలో పోటీ చేయడానికి అభ్యర్థులైనా ఉన్నారా? లేరు. రాహుల్ గాంధీకి గ్రౌండ్లో పరిస్థితి తెలిసి ఉంటుందని అనుకుంటున్నా.’ అని ఆ నేత వ్యాఖ్యానించారు. మరోవైపు స్థానిక జేడీఎస్ నేతలు కూడా తమ పార్టీకి ఆరు సీట్లు ఇస్తే చాలనే అభిప్రాయంలో ఉన్నట్టు సమాచారం.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.