ASSEMBLY PRIVILEGE COMMITTEE ISSUES NOTICE TO SEC NIMMAGADDA RAMESH KUMAR OVER ALLIGATIONS ON MINISTERS PEDDIREDDY RAMACHANDRA REDDY AND BOSTA SATYANARAYANA FULL DETAILS HERE PRN
YCP vs Nimmagadda: చల్లారని పంచాయతీ.. ఎస్ఈసీకి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు...
ఈ నెల 19 నుంచి నాలుగు రోజుల పాటు సెలవు పెట్టుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. (SEC Nimmagadda Ramesh Kumar)అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ (Assembly Privilege Committee)ఇచ్చిన నోటీసుపై స్పందిస్తారా.. ? విచారణకు హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య వార్ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల సమయంలో మొదలైన వైరం మధ్యలో కాస్త శాంతించినా.. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ మొదలైంది. తమను హౌస్ అరెస్ట్ చేయాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయగా.. దీనిపై బుధవారం చర్చించిన కమిటీ.. గురువారం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ కార్యదర్శి ద్వారా నిమ్మగడ్డకు నోటీసులు పంపారు. ఐతే ఈ నెల 19 నుంచి నాలుగు రోజుల పాటు సెలవు పెట్టుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నోటీసుపై స్పందిస్తారా.. ? విచారణకు హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై గత నెల 2వ తేదీన సమావేశమైన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈనెల 17న భేటీ అయి ఆయనకు నోటీసులిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. నిమ్మగడ్డ పదవిలో ఉన్నా లేకపోయినా విచారణకు హాజరుకావాల్సిందేనని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై స్పీకర్ గవర్నర్ అభిప్రాయాన్ని కోరగా.. రూల్ నం.173 ప్రకారం ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయాలని గవర్నర్ సూచించినట్లు గతంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 2006లో మహారాష్ట్రలో అప్పటి ఎస్ఈసీ నందలాల్ – రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన కేసుపై చర్చించినట్లు కూడా వెల్లడించారు. శాసనసభ్యుల హక్కులను కాపాడే విషయంలో ప్రివిలేజ్ కమిటీకి పూర్తి అధికారాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. నిమ్మగడ్డ వ్యవహారంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిమ్మగడ్డ తీసుకున్న చర్యల వల్ల తమకు బాధ కలగలేదని మంత్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. గవర్నర్ కు లేఖరాస్తూ ఉద్దేశపూర్వకంగా మాపై ఆరోపణలు చేశారని.. వాటి వల్లే తమ హక్కులకు భంగం కలిగిందని ఫిర్యాదులో చెప్పారని వివరించారు. ఇందులో ఎలాంటి పక్షపాతం, కక్షసాధింపు లేదని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో కేసులో ఏం జరిగిందంటే..!
2006లో అప్పటి మహారాష్ట్ర ఎస్ఈసీగా ఉన్న నందలాల్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎమ్మెల్యే జనార్ధన్ చందూకర్ స్పీకర్ కు సభాహక్కుల నోటీసులిచ్చారు. ఎమ్మెల్యే ఇచ్చిన నోటీసులపై విచారణకు స్వీకరించిన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఎస్ఈసీని వివరణ కోరింది. ఎస్ఈసీ విచారణకు హాజరుకాకపోగా.. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రివిలేజ్ కమిటీ 2008 మార్చిలో ఆయనకు 7 రోజుల జైలు శిక్ష విధించాలని సిఫార్సు చేసింది. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం శిక్షను ఖరారు చేశారు. ఐతే సీఎం జోక్యంతో ఆ శిక్ష కాస్తా 2 రోజులకు తగ్గించారు. ఐతే ప్రివిలేజ్ కమిటీ తీర్పును నందలాల్ హైకోర్టులో సవాల్ చేయగా.. 2014లో ఆ పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. శాసన సభ్యుల హక్కుల ఉల్లంఘన విషయంలో ప్రివిలేజ్ కమిటీకి పూర్తి అధికారాలుంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.