5 State Assembly Elections Results: కమలం మళ్లీ వికసించింది. తమకు ఎదురులేదని మరోసారి నిరూపించింది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ చాటింది. ఐదు రాష్ట్రాల్లో నాలుగింట ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand)లో స్పష్టమైన మెజారిటీ కనబరించింది. మ్యాజిక్ మార్క్ చేరుకోకున్నా.. ఇతరుల సాయంతో గోవా, మణిపూర్‌లోనూ మళ్లీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండోసారి భారీ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో విజయంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ చరిత్ర సృష్టించబోతున్నారు. సీఎంగా యోగి రెండో సారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఐతే 37 ఏళ్ల తర్వాత అధికారం నిలబెట్టుకున్న సీఎంగా చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్‌కు చెందిన ఎన్డీ తివారి 1985 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత ఎవరూ వరుసగా రెండోసారి సీఎంగా పనిచేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు యోగి ఆ ఘనత సాధించారు.
రైతుల ఆందోళనలు, రేప్ కేసుల నిరసనలతో గత ఏడాది యూపీ అట్టుడికి... అవేమీ ఎన్నికల్లో ప్రభావం చూపించలేదు. రైతుల ఆందోళనలు ఎక్కువగా జరిగిన పశ్చిమ యూపీలో కూడా అత్యధిక సీట్లను కైవసం చేసుకుంది. రైతులను చంపారని ఆరోపణలు వచ్చిన లఖింపూర్ జిల్లాల్లోనూ కమలం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఐతే గతంలో పోల్చితే ఈసారి కాస్త తక్కువ సీట్లే వచ్చినా.. ఓట్ల శాతం మాత్రం పెరిగినట్లు తెలుస్తోంది. బీజేపీకి సమాజ్‌వాదీ పార్టీ గట్టి పోటీ ఇచ్చినా.. ప్రభుత్వం ఏర్పాటు చేసేంతలా సీట్లు గెలవలేదు. మోదీ-యోగి డబుల్ ఇంజిన్ నినాదం ముందు ఎవరూ నిలవలేదు. కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలైతే సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. ఎంఐఎం పత్తా లేకుండా పోయింది.
తెలంగాణలో ఉత్తరప్రదేశ్ నినాదం.. బీజేపీ సరికొత్త ప్లాన్.. బయటపెట్టిన బండి సంజయ్
పంజాబ్ (Punjab Assembly Election 2022 result) రాజకీయాలను ఆమాద్మీ పార్టీ తమ చీపురుతో ఆసాంతం ఊడ్చేసింది. అక్కడ వార్ వన్ సైడ్ అయింది. స్పష్టమైన మెజారిటీతో ఆప్ దూసుకెళ్లింది. ఆప్ సునామీలో పెద్ద పెద్ద రాజకీయ ఉద్దండులు సైతం కొట్టుకుపోయారు. సామాన్య ప్రజలే అక్కడ అగ్రనేతలను ఓడగొట్టారు. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. మాజీ సీఎం అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధు, ప్రకాశ్ సింగ్ బాదల్ పరాజయం పాలయ్యారు. అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీలను ఆమాద్మీ దారుణంగా దెబ్బకొట్టింది. ఆప్ నేత భగవంత్ మాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. తాను సీఎం అయ్యాక.. తొలి సంతకం నిరుద్యోగ నిర్మూలపైనే చేస్తానని ఆయన ప్రకటించారు.
సీఎంను ఓడించిన స్వీపర్ కొడుకు: పంజాబ్‌లో సంచలనం.. ఇక దేశాన్ని ఊడ్చేస్తామంటూ..
గోవా (Goa)లో మ్యాజిక్ నెంబర్ 21కి ఒక్క సీటు దూరంలో ఆగిపోయింది. హంగ్ వస్తుందని అందరూ భావించినప్పటికీ.. అదేమీ జరగలేదు. 20 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఐతే ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది బీజేపీ. మణిపూర్((Manipur Assembly Election 2022 result) )లోనూ అతి పెద్ద పార్టీగా అవతరించనుంది. ఇతర పార్టీల మద్దతులతో అక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది. గోవాలో మళ్లీ ప్రమోద్ సావంతే సీఎం అవుతారా? మణిపూర్‌నూ మళ్లీ బీరెన్ సింగే పాలిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
BJP తర్వాతి టార్గెట్ KCR: యూపీ బుల్డోజర్లు తెలంగాణకూ వస్తాయి.. ముందస్తు ప్లాన్ చెప్పేసిన నేత
ఉత్తరాఖండ్ (Uttarakhand Assembly Election 2022 result)లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా.. అలాంటి ఫలితాలు కనిపించడం లేదు. ఉత్తరాఖండ్‌లో స్పష్టమైన మెజారిటీతో సాధించింది. కానీ సీఎం పుష్కర్ ధామి ఓడిపోవడం పార్టీ వర్గాలు జీర్ణించుకోవడం లేదు. పార్టీని గెలిపించి.. తాను ఓడిపోయారు. సీఎం మాత్రమే కాదు.. విపక్ష నేత, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి హరీష్ రావత్ కూడా ఓటమి పాలయ్యారు. ఆయన కూతురు కూడా గెలవలేదు. ఉత్తరాఖండ్‌లో సీఎం ఓడిపోవడంతో.. ఆయన స్థానంలో ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై త్వరలోనే బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది. మొత్తంగా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపుతో బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కమలం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.