TRS MLA Athram Sakku: ఇక్కడ స్టూలుపై కూర్చుని భోజనం చేస్తున్న వ్యక్తి ఎవరో తెలిస్తే.. నోరెళ్లబెట్టడం ఖాయం..!

రోడ్డు పక్కన సాధారణ వ్యక్తిలా టిఫిన్ చేస్తున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ఓ గన్ మెన్ రోడ్డు పక్కన టిఫిన్ చేస్తున్నాడు. ఎవరికి గన్ మెన్ వి అని పక్కన ఉన్న వ్యక్తి అడిగాడు. ‘అదిగో మా సార్ అక్కడ ఉన్నారు.. టిఫిన్ చేస్తున్నారు‘ అని అన్నాడా గన్ మెన్. ఇంతకీ ఎవరాయన అని గన్ మెన్ ని అడిగితే..

  • Share this:
    అది హైదరాబాద్ కు వెళ్లే హైవే మార్గం. రోడ్డు పక్కన ఓ టిఫిన్ బండి. ఓ యువకుడు భుజంలో గన్ను వేలాడదీసుకుని టిఫిన్ చేస్తున్నాడు. అతడిని చూస్తేనే అందరికీ ఇట్టే అర్థం అయిపోతుంది అతడో గన్ మెన్ అని. ఇక్కడ అంత పెద్ద సెలబ్రెటీ ఎవరు ఉన్నారా..? అని అందరూ చుట్టూ చూశారు. దగ్గర్లో ఏమైనా బడా బాబుల కార్లు ఆగాయా..? అని కూడా జనం లుక్కేశారు. కానీ వాళ్లకు సెలబ్రెటీలు ఎవరూ కనిపించలేదు. ఎవరికి గన్ మెన్ వి.. అని అతడిని అడిగాడో వ్యక్తి. ’అదిగో మా సార్.. అక్కడ టిఫిన్ చేస్తున్నారు.‘ అని ఓ వ్యక్తిని చూపించాడు. ఓ స్టూలుపై కూర్చుని, మెడలో కండువా వేసుకుని ఓ సాధారణ మనిషిలా కనిపించాడాయన. ’ఇంతకీ ఎవరాయన?‘ అని గన్ మెన్ ను అడిగాడా వ్యక్తి. ’ఎమ్మెల్యే, మీకు తెలియదా.?‘ అని గన్ మెన్ అనేసరికి అక్కడ ఉన్నవాళ్లంతా అవాక్కయ్యారు. ఓ ఎమ్మెల్యే, ఇలా రోడ్డు పక్కన టిఫిన్ బండ్ల దగ్గర కూడా తింటారా.? అని నోరెళ్లబెట్టారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    ఒక్కసారి సర్పంచ్ గానో లేక ఏ ఇతర ప్రజాప్రతినిధిగానో ఎన్నికైతే చాలు ఎంతో డాబు దర్పం ప్రదర్శించేవారు ఉన్న రోజులువి. కాని ఆయన రెండుసార్లు శాసన సభ్యుడిగా ఎన్నికైనా ఏ డాబు దర్పం లేకుండా సాధారణ వ్యక్తిగా మెలుగుతారు. ఆయనే ఆసిఫాబాద్ శాసన సభ్యుడు ఆత్రం సక్కు. సగటు మధ్య తరగతి మనిషిలా జీవనం సాగిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. హైదరాబాద్ నుండి తన నియోజకవర్గమైన ఆసిఫాబాద్ కు బయలుదేరి వస్తుండగా మధ్యలో ఆయనకు ఆకలేసింది. ఏదో పెద్ద స్టార్ హోటల్ దగ్గర ఆగుతారని గన్ మెన్ అనుకున్నాడు. కానీ రోడ్డు పక్కన ఓ టిఫిన్ బండి కనిపించేసరికి డ్రైవర్ ను కారు ఆపమని చెప్పారు. తానో ఎమ్మెల్యేనన్న భావన లేకుండా, ఓ సాధారణ మనిషిలా అక్కడ టిఫిన్ చేశారు. అక్కడ టిఫిన్ చేస్తున్నది ఎమ్మెల్యే అని తెలిసి, చుట్టుపక్కల వారు అవాక్కయ్యారు.

    గతంలో కూడా ఆసిఫాబాద్ నుండి మంచిర్యాలకు వచ్చిన ఎమ్మెల్యే సక్కు, బెల్లంపల్లి చౌరస్తాలోని ఓ సాధారణ హోటల్ కు వెళ్ళి భోజనం చేసి వెళ్ళారు. పదవి శాశ్వతం కాదని, ప్రజలకు చేసే సేవా కార్యక్రమాలు శాశ్వతమని నమ్మిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పటికి సాధారణ మనిషిలా మసలుకోవడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ తన నియోజకవర్గంలో కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారు వండుకున్న భోజనాన్నే, వారితో కలిసి కూర్చుని సహపంక్తి భోజనం చేస్తుంటారు. ‘కొందరు ఎమ్మెల్యేలు అయితే ప్రత్యేకంగా హోటల్ నుంచి భోజనం తెప్పించుకంటారు. మా ఎమ్మెల్యే అయితే మా ఇంట్లో మేం వండుకున్న అన్నం పెట్టినా తింటారు. ఆయనకు తన పర బేధాలు ఉండవు..‘అని ఆత్రం సక్కు అభిమానులు చెప్పుకుంటుంటారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఎమ్మెల్యే ఉండటం అరుదు కదూ..
    Published by:Hasaan Kandula
    First published: