మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యానించారు. శనివారం జమ్మూ కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై లోక్‌సభలో శనివారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన అసదుద్దీన్.. "ఇది ప్రారంభం మాత్రమే. ప్రభుత్వం భవిష్యత్తులో హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి నగరాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే అవకాశం ఉంది"అని అన్నారు. అలాగే ఈ ఏడాది బడ్జెట్లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేటాయింపులకు పెరిగాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను అసదుద్దీన్ ఖండించారు. మైనారిటీ వ్యవహారాల శాఖ బడ్జెట్ నుంచి రూ. 1,024 కోట్లను తగ్గించారని ఆరోపించారు. రూ. 5,029 కోట్లు అంచనావేయబడిన బడ్జెట్ రూ. 4,005 తగ్గిందని అన్నారు. ప్రస్తుతం సంవత్సరంలో 20.36 శాతం కేటాయింపులు తగ్గాయని తెలిపారు.
ఇక, జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై లోక్‌సభలో ప్రసంగించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌కు సరైన సమయంలో రాష్ట్ర హోదా ఇస్తామంటూ వ్యాఖ్యానించారు. బిల్లు తేవడమంటే రాష్ట్ర హోదా ఇవ్వబోమని అర్థం కాదన్నారు. రాష్ట్ర హోదా ఇవ్వబోమని ఈ బిల్లులో ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. హింస, అశాంతితో కూడిన పాత రోజులు కశ్మీర్లో మళ్లీ రావన్నారు. జమ్మూకశ్మీర్‌పై ప్రతి అంశానికి వివరణ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టులో రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి జమ్మూ కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు సోమవారం రాజ్యసభ ఆమోదం తెలుపగా.. శనివారం లోక్‌సభ కూడా ఆమోదం తెలిపింది.