ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కు మరో రెండు వారాలు గడువు మిగిలున్న నేపథ్యంలో ఈ ఎన్నికలపై భారీగా ఆశలు పెట్టుకున్న జనసేనలో నిరుత్సాహం కనిపిస్తోంది. అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ కీలక నేతలంతా ఎక్కడికక్కడ గప్ చుప్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో జనసేనకు సింగిల్ డిజిట్ తప్పదన్న అంచనాల ప్రభావమో, అధినేత పవన్ మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్దమవుతున్నాడన్న వార్తల ప్రభావమే తెలీదు కాని జనసేనలో మాత్రం ఓ రకమైన నిస్తేజం కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజున ఈవీఎంల మొరాయింపుపై టీడీపీ నానా రచ్చా చేసింది. ఈ విషయాన్ని జాతీయ స్దాయిలో చర్చకు పెట్టింది. పోలింగ్ ముగిశాక కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఎంలు, వీవీ ప్యాట్లను హ్యాక్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తుంటే … వైసీపీ క్యాడర్ కూడా ఇప్పటికే ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లకు నిత్యం కాపలా కాస్తోంది. జనసేన మాత్రం ఈవీఎంలే కాదు ఫలితాలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగానే వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ఏపీ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం ఉంటుందని, సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలమని, కింగ్ మేకర్లం కావడం ఖాయమంటూ ఆరంభంలో ప్రకటనలు చేసిన నేతలంతా రెండు వారాలుగా పూర్తిగా మౌనంగా ఉన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ కు తాము ఐదు పార్లమెంటు సీట్లు, 40 అసెంబ్లీ సీట్లు గెలుస్తున్నామంటూ నివేదికలు ఇచ్చిన వారంతా ఇప్పుడు సైలెంట్ అయిపోవడం వెనుక ఆంతర్యం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఓవైపు ఫలితాలు ఎటూ తమకు ప్రతికూలంగా వస్తాయన్న అంచనాతో టీడీపీ దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుండగా... జనసేన కనీసం ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేయకపోవడం సాధారణ కార్యకర్తల్లో ఆందోళన రేపుతోంది.
ఏపీలో మార్పు తెస్తామంటూ జనసేనతో సొంత రాజకీయం ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. ఆ దిశగా సక్సెస్ అయ్యారో లేదో ఈ నెల 23న తేలిపోనుంది. అయితే పార్టీ నిర్వహించిన సమీక్షల్లో సైతం పవన్ కళ్యాణ్ .. తమకు సీట్లు ముఖ్యం కాదంటూ ఎంతో కొంత మార్పు తేవడమే ప్రధానమని చెప్పుకొచ్చారు. పవన్ స్టేట్ మెంట్ తో పార్టీ శ్రేణులు కూడా ఇప్పుడు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. తాము అనుకుంటున్నట్లుగా కింగ్ మేకర్ పాత్రకు సరిపడా సీట్లు కూడా రావడం లేదనే అంచనాకు నేతలంతా వచ్చేసినట్లు ప్రచారం సాగుతోంది. అందుకే ఫలితాల రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కౌంటింగ్ ఏజెంట్ల నియామకం, ఫలితాల పర్యవేక్షణవైపు దృష్టిసారించేందుకు సైతం జనసేన నేతలు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం సాగుతోంది.
ఎన్నికల్లో గెలిచి అధికారం నిలబెట్టుకుంటామన్న ఆశలు లేకపోయినా సీఎం చంద్రబాబు మాత్రం తమకు 130 సీట్లు ఖాయమని చెప్తున్నారు. అంతర్గత సమీక్షల్లో సైతం తమకు 95 సీట్లు తథ్యమని చెప్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాము ఏకపక్షంగా సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు పోలింగ్ అనంతరం ప్రకటించారు. కానీ జనసేన అధినేత పవన్ ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. పార్టీ అంతర్గత సమీక్షలో మాత్రం సీట్ల కంటే మార్పే ముఖ్యమన్నారు. దీంతో పవన్ వైఖరిపై పార్టీ శ్రేణుల్లో నిస్తేజం వ్యక్తమవుతోంది. పోలింగ్ ముగిసి ఫలితాలు రాకముందే ఇలా ఉంటే రాబోయే ఐదేళ్లలో తమ పరిస్ధితి ఏమిటని జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్ధులతో పాటు కీలక నేతలు సైతం ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానిస్తున్నారు. తద్వారా ప్రజారాజ్యం నాటి పరిస్ధితులు పునరావృతం అవుతాయన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. పవన్ ఓ కొత్త సినిమాకు అంగీకరించారన్న వార్తలు కూడా వారి ఆందోళనకు మరో కారణం.
(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్18)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Election Commission of India, Janasena party, Lok Sabha Election 2019, Pawan kalyan