ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమరణ దీక్షకు రెడీ అయ్యారు. మార్చి 1 నుంచి ఆయన ఆమరణ దీక్ష చేయనున్నారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్రం హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ ప్రకటనకు ముందే.. ఆయన ప్రధాని నరేంద్ర మోదీని ‘ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా’ ఇవ్వాలని కోరారు. ‘ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండ్ కోసం ప్రజలు ఓ ఉద్యమాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు’ అని కేజ్రీవాల్ అన్నారు. ‘మార్చి 1 నుంచి ఆ ఉద్యమాన్ని మేం ప్రారంభిస్తున్నాం. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా వచ్చేవరకు ఆ ఉద్యమాన్ని మేం వదిలిపెట్టం’ అని స్పష్టం చేశారు.
‘దేశం మొత్తం ప్రజాస్వామ్యాన్ని అమలు చేశారు. కానీ ఢిల్లీలో మాత్రం కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నా... దాని చేతిలో అధికారాలు లేవు’ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మధ్య వార్ నడుస్తోంది. ఓ దశలో వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అయితే, సుప్రీంకోర్టు కూడా ఎవరి విధులు ఏంటో విశదీకరిస్తూ తీర్పు చెప్పింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను లెఫ్టినెంట్ గవర్నర్ గౌరవించాలని స్పష్టం చేసింది. తాజాగా, ఏసీబీ నియంత్రణను కేంద్రానికి అప్పజెప్పింది. ఢిల్లీ ప్రభుత్వంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిపై ఏసీబీ విచారణకు ఆదేశించే అధికారాన్ని కేంద్రానికే ఇచ్చింది. దీనిపై మళ్లీ వివాదం చెలరేగింది.