(జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కరస్పాండెంట్, న్యూస్18)
అనగనగా ఓ గొప్ప రాజు.. ఆయనకొక రాజ్యం. సింహాసనంపై కన్నేసిన దాయాదులు ఓ పన్నాగం పన్నారు. తమకు నమ్మకమైన ఓ మంత్రికి బాధ్యత అప్పగించారు. తదుపరి రాజెవరో తేల్చే పరీక్షంటూ రాజు కొడుకులందరినీ నిరాయుధులుగా విడివిడిగా రాత్రి భోజనానికి రమ్మన్నాడు. ఒక్కొక్కరే వచ్చారు. వచ్చినవారిని వచ్చినట్టే కత్తులబావిలో తోసేశాడు. పడ్డవాళ్లు పడ్డట్టే.. ఇక ఎవరూ తిరిగిరాలేదు. ఫలితం రాజ్యం దాయాదుల పాలైంది. మంత్రి మహామంత్రయ్యాడు. రాజు కారాగారం పాలయ్యాడు. ఇది కథల్లో చదివి ఉంటాం. విని ఉంటాం. కానీ చరిత్రలో ఎక్కడో ఒకచోట జరగకుండా పూర్తిగా కథగా మాత్రం ఉండిపోలేదు. అది ఆనాటి కథైతే.. ఇప్పుడు ఈ కథలో కత్తుల బావిని కొద్దిగా మార్చి.. బూబీట్రాప్స్గా మార్చడంలో మావోయిస్టులు ఆరితేరారు. తమకు వర్గ శత్రువుగా మారిన పోలీసులను మట్టుబెట్టడమే పనిగా పెట్టుకున్న మావోయిస్టులు తమకున్న పరిమిత వనరులతో బుర్రకు పనిచెబుతున్నారు. తమను వేటాడడానికి వచ్చే పోలీసులే లక్ష్యంగా బూబీ ట్రాప్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ట్రాప్స్ల్ లో పడ్డారంటే ఇక లేవడం.. కోలుకోవడం కష్టసాధ్యమే మరి.
అసలేంటీ బూబీ ట్రాప్స్.. ?
మావోయిస్టు ప్రభావిత అటవీ ప్రాంతాలలోకి పోలీసులు ధీమాగా వెళ్లేందుకు వీల్లేకుండా ఏర్పాటు చేసిన కత్తుల బావులివి. చత్తీస్ఘడ్ సరిహద్దు ప్రాంతంలోని అడవుల్లోకి అడుగు పెట్టారంటే ఎక్కడ ల్యాండ్ మైన్ ఉందో.. ఎక్కడ బూబీ ట్రాప్ ఉందో తెలుసుకోవడం చాలా కష్టం. అడుగులో అడుగేసుకుంటూ అప్రమత్తంగా వెళ్తేనే క్షేమం. లేదంటే కష్టం.
చరిత్రలో చాలా సందర్భాలలో చదువుకునో, లేదంటే విని ఉంటాం. శత్రు సైన్యాన్ని మట్టుబెట్టడానికి యుద్ధభూమి నుంచి కోటలోకి వెళ్లే మార్గానికి దగ్గరలో ఏర్పాటు చేసే భారీ కత్తుల బావులివి. ఫలితం అనుకూలంగా లేనపుడు శత్రుసైన్యాన్ని గంపగుత్తగా మట్టుబెట్టడానికి వేసే ఎత్తుగడ ఇది. అప్పటికే కోట చుట్టూ ఏర్పాటు చేసిన వీటిలో పడి శత్రసైన్యాలు కకావికలవుతాయి. ఇలాంటి మధ్యయుగాల యుద్ద రీతులను గతకొన్నేళ్లుగా మావోయిస్టులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. పూర్తిగా రక్షణ తంత్రంలో భాగం ఇది. శత్రువును భయానికి లోను చేయడం.. కంగారులో ఉన్నసమయంలో దాడికి పాల్పడడం ఇప్పుడు మావోయిస్టులు అమలు చేస్తున్న తంత్రం. గతంలో చత్తీస్ఘడ్ అటవీ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఈ బూబీట్రాప్ వ్యవస్థను విస్తరించే పనిలో ఇప్పుడు మావోలు నిమగ్నమయ్యారు. శుక్రవారం నాటి కూంబింగ్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో ఈ బూబీ ట్రాప్స్‌ను పోలీసు బలగాలు గుర్తించాయి. కేవలం ఒక కిలోమీటరు వైశాల్యంలో వందకుపైగా బూబీ ట్రాప్స్‌ను ఏర్పాటు చేశారంటే మావోయిస్టులు ఎంతటి అప్రమత్తతతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇలా ఏర్పాటు చేస్తారు..
రాళ్లు, రప్పలు, చెట్టు చేమ నిండి ఉండే అటవీ ప్రాంతంలో నడక మార్గానికి అనువుగా ఉండే ప్రదేశంలో వీటిని ఏర్పాటు చేస్తారు. నాలుగు నుంచి ఐదడుగుల పొడవు, వెడల్పున, రెండుడుగుల లోతులో.. ఓ పెద్ద చెక్కకు అమర్చిన పదునైన ఇనుప చువ్వలను పరుస్తారు. గుర్తించడానికి వీల్లేకుండా తేలికపాటి కర్రలు, పెద్ద పెద్ద ఆకులు కప్పుతారు. పరీక్షగా చూస్తేగానీ గుర్తించలేనంత జాగ్రత్తగా వీటిని పెడతారు. ఇక వాళ్లు కాకుండా వేరైవరైనా ఆ మార్గంలో వెళ్లాల్సి వచ్చినపుడు తప్పనిసరిగా అక్కడ కాలు వేయాల్సిందే. పొరపాటున వేశారో చురకత్తుల్లాంటి పదునైన ఇనుప మేకులు శరీరంలోకి దిగినట్టే. ఇలా ఈ గోతిలో పడి తేరుకుని లేచేలోపుగానే ఎదురుదాడి మొదలవుతుంది. అతి పురాతనమైన ఈ పోరాటవిద్యను మావోయిస్టులు తమకు రక్షణగా ఈ మధ్యకాలంలో విస్త్రుతంగా అమలు చేస్తున్నారు. శత్రువు కోలుకునేలోగా దాడి చేయొచ్చు. విపరీతంగా ప్రాణనష్టాన్ని కలుగజేయొచ్చన్నది ఇక్కడి వ్యూహం. ఇలా ఒకచోట బూబీట్రాప్.. మరోచోట ల్యాండ్ మైన్.. కాలు తీసి కాలు పెట్టాలంటే హడలి పోయేటంతటి స్థాయిలో భూమినే ఆయుధ క్షేత్రంగా మలచుకోవడంలో మావోయిస్టులు ఆరితేరిపోయారు. ఇది మావోయిస్టుల వేటకు వెళ్లే కూంబింగ్ బృందాల పాలిట శాపంగా పరిణమించింది. ఇలా ఈ ట్రప్స్లో పడి తీవ్రంగ గాయపడిన వాళ్ల సంఖ్య లెక్కలేనిది. ఎంతో అనుభవం ఉన్న కమాండర్ కనుసన్నల్లో జరిగే ఆపరేషన్‌లో మాత్రమే వీటి బారిన పడకుండా ముందుకు వెళ్లగలిగే వీలుంటుంది. గడచిన రెండు రోజుల్లో చర్ల పోలీసులు వందకు పైగా ఈ బూబీ ట్రాప్స్‌ను గుర్తించడం గమనార్హం.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 16, 2021, 17:55 IST