Uddhav Thackery: ‘మేమేంటి.. బంగ్లాదేశ్, కజకిస్తాన్ నుంచి వచ్చామా?’ బీజేపీపై ఉద్ధవ్ థాక్రే ఫైర్

బీహార్‌లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామంటూ మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇవ్వడంపై మహారాష్ట్ర సీఎం థాక్రే మండిపడ్డారు.

news18-telugu
Updated: October 25, 2020, 10:54 PM IST
Uddhav Thackery: ‘మేమేంటి.. బంగ్లాదేశ్, కజకిస్తాన్ నుంచి వచ్చామా?’ బీజేపీపై ఉద్ధవ్ థాక్రే ఫైర్
ఉద్ధవ్ థాక్రే (File )
  • Share this:
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మండిపడ్డారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ.. జేడీయూ చీఫ్, సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో మరోసారి అధికారంలోకి వస్తే ప్రతి బీహారీకి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు. దీనిపై ఉద్ధవ్ థాక్రే ఫైర్ అయ్యారు. ‘మీరు బీహార్‌కు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని హామీ ఇచ్చారు. మరి మిగిలిన రాష్ట్రాల వారు ఏంటి? బంగ్లాదేశ్, కజకిస్తాన్ నుంచి వచ్చారా?. అలా మాట్లాడే వారు తమను చూసి తాము సిగ్గుపడాలి.’ అని ఉద్ధవ్ థాక్రే అన్నారు. దసరా సందర్భంగా శివసేన పార్టీ నేతల సమావేశంలో ఉద్ధవ్ థాక్రే మాట్లాడారు. ప్రతి సంవత్సరం దసరా రోజు శివసేన సమావేశం ముంబైలోని శివాజీ పార్క్‌లో జరుగుతుంది. ఈ సారి కరోనా వైరస్ కారణంగా దాదర్‌లోని సావర్కర్ హాల్లో నిర్వహించారు. ‘నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయింది. నేను సీఎం అయిన రోజు నుంచి నా ప్రభుత్వాన్ని కూల్చేస్తారని చెబుతున్నారు. ఇప్పుడు సవాల్ చేస్తున్నా. ఎవరికైనా సత్తా ఉంటే నా ప్రభుత్వాన్ని పడగొట్టి చూపించండి.’ అని ఉద్ధవ్ థాక్రే ఛాలెంజ్ చేశారు.

జనతాదళ్ యునైటెడ్‌తో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ.. తమ కూటమి ఎన్నికల్లో గెలిస్తే బీహార్ వాసులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు మేనిఫెస్టోలో ప్రకటించింది. సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ నేతలు ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. అయితే, మేనిఫెస్టోలో ‘ఓటుకు వ్యాక్సిన్’ అంశం పెద్ద దుమారానికి దారి తీసింది. బీహార్ వాసులకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తుంటే, మిగిలిన దేశం మొత్తానికి ఇవ్వరా? అనే చర్చ మొదలైంది. అసలు కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ ఇస్తుంటే, ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదేముందంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి.


ఈ అంశం పెద్ద దుమారం రేగడంతో బీజేపీ స్పందించింది. బీజేపీ ఐటీ సెల్ ఇన్ ‌చార్జి అమిత్ మాలవీయ స్పందించారు. ‘కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నామమాత్రపు ధరకు వ్యాక్సిన్ అందిస్తుంది. అయితే, దాన్ని రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇవ్వడమా లేకపోతే ఆ ధరను ప్రజల వద్దే వసూలు చేయడమా అనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి. బీహార్‌లో మాత్రం బీజేపీ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.’ అని అమిత్ మాలవీయ తెలిపారు.



మరోవైపు కంగనా రనౌత్ మీద పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘కొంతమంది పొట్టకూటి కోసం ముంబైకి వస్తారు. ఆ తర్వాత అదే నగరాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటారు.’ అంటూ కంగనా గతంలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘బీహార్ పుత్రుడు (సుశాంత్ సింగ్ రాజ్ పుత్) కోసం ఏడ్చేవాళ్లు మహారాష్ట్ర పుత్రుడు (ఆదిత్య థాక్రే) క్యారెక్టర్‌ని అంతం చేసేలా మాట్లాడుతున్నారు.’ అంటూ మరో కామెంట్ చేశారు. సుశాంత్ కేసులో తన కుమారుడు ఆదిత్య థాక్రే మీద వస్తున్న విమర్శలకు ఈ రకంగా బదులిచ్చారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 25, 2020, 10:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading