APRIL 14TH SPECIAL DAY IN TELUGU STATES CM KCR CM JAGAN PAWAN KALYAN CAMPAIGN SAME DAY NGS
Andhra Pradesh: ఏప్రిల్ 14న స్పెషల్ డే. తిరుపతిలో జగన్-పవన్ ప్రచారం. రెండోసారి వకీల్ సాబ్ అడుగు
ఒకే రోజు జగన్, పవన్, కేసీఆర్ ప్రచారం
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి.. చాలా ప్రత్యేకమైన రోజు.. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 14వ తేదీ రాజకీయంగా బిగ్ డే అవుతోంది. అదే రోజు అటు నాగార్జున సాగర్ లో సీఎం కేసీఆర్ ప్రచారానికి వెళ్తున్నారు. ఇటు తిరుపతిలో సీఎం జగన్, పవన్ కళ్యాణ్ ప్రచారానికి సిద్ధమవుతున్నారు.
ఏప్రిల్ 14వ తేదీ.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏప్రిల్ 14వ తేదీపై స్పెషల్ ఫోకస్ పడింది. ఇటు ఏపీ సీఎం జగన్, అటు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ అదే రోజు ఉప ఎన్నికల ప్రచార బరిలో దిగుతున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం కేసీఆర్ వెళ్తున్నారు. అదే రోజు సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఇలా ఒకే రోజు ఇద్దరూ సీఎంల ప్రచారంతో రెండు రాష్ట్రాల్లో అందరి ఫోకస్ అదే రోజుపై పడింది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పవన్ కళ్యాన్, బీజేపీ జాతీయ నేతలు సైతం ఏప్రిల్ 14నే టార్గెట్ చేస్తున్నారు. వకీల్ సాబ్ హిట్ తో జోష మీద ఉన్న పవన్ రెండోసారి తిరుపతి ప్రచారానికి సై అంటున్నారు.
ఇప్పటికే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంది. అధికార, విపక్ష నేతల విమర్శలతో రాజకీయం పూర్తిగా వేడెక్కింది. ఫలితం సంగతి ఎలా ఉన్నా.. మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ తరపున మంత్రులు, కీలక నేతలు అంతా తమ అభ్యర్థి గురుమూర్తి తరపున ప్రచారం చేస్తున్నారు. తిరుపతిలోనే మకాం వేసి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పుడు స్వయంగా అధినేత జగన్ ప్రచార బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 14న తిరుపతిలో ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఆయన తిరుపతి ప్రజలకు లేఖలు కూడా రాశారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరపున అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అక్కడే ఉండి ప్రచారంలో దూకుడు పెంచారు. ఇటు బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ తరపున ప్రచారం చేసేందుకు జాతీయ నేతలు తరలి వస్తున్నారు. రత్నప్రభకు మద్దతుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రచారం చెయ్యగా.. మరోసారి తిరుపతికి పవన్ కళ్యాణ్ వస్తున్నారు.
తిరుపతి ఉప ఎన్నిక గెలుపుతో ఏపీలో అడుగుపెట్టాలని బీజేపీ భావిస్తోంది. అందుకే పవన్ ఇమేజ్ ఉపయోగపడుతుందని ఆశిస్తోంది. తాజాగా అతడు నటించిన వకీల్ సాబ్ చిత్రం హిట్ టాక్ కూడా.. తమకు ప్లస్ అవుతుందని భావిస్తోంది. ఇదే జోష్ లో జాతీయ నేతలంతా ప్రచారానికి క్యూ కట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తిరుపతి ఉపఎన్నికల ప్రచారానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాబోతున్నారు. నడ్డా ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ఏప్రిల్ 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి ప్రచారానికి వెళ్లనున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి తిరుమల అలిపిరి వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు ఇరుపార్టీల ముఖ్యనేతలు. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికతో ఏపీలో రాజకీయంగా హీట్ పెరిగింది. ఇప్పుడు కీలక నేతలు నేరుగా బరిలో దిగుతుండడంతో పరిస్థితి రణంగాన్ని తలపిస్తోంది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.