అసలే కష్టాల్లో ఉన్న ఏపీ టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుందా ? టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కళా వెంకట్రావు టీడీపీని వీడి బీజేపీలో చేరబోతున్నారా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొంతకాలం నుంచి రాజకీయంగా సైలెంట్‌గా ఉన్న కళా వెంకట్రావు.. టీడీపీ నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న తనను తొలగించి.. ఆ స్థానంలో అచ్చెన్నాయుడును నియమించడంపై వెంకట్రావు అసంతృప్తికి అసలు కారణమనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే ఆయన టీడీపీని వీడేందుకు సిద్ధమవుతున్నాడని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
టీడీపీలో అసంతృప్తిగా ఉన్న కళా వెంకట్రావుతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారని.. త్వరలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కళా వెంకట్రావును కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఏపీలో రాజకీయంగా బలపడేందుకు అనేక వ్యూహాలు రచిస్తున్న బీజేపీ.. ఇందుకోసం ఇతర పార్టీలకు చెందిన నేతలను చేర్చుకోవడంపై ఫోకస్ పెట్టింది. అధికార వైసీపీ నుంచి బీజేపీలోకి వచ్చే నేతల సంఖ్య తక్కువ కావడంతో.. ప్రతిపక్ష టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చే నేతలపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది.
ఈ క్రమంలోనే ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలపై దృష్టి సారించిన కమలనాథులు.. తాజాగా టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావును పార్టీలోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో బీజేపీకి పెద్దగా పట్టులేదు. కళా వెంకట్రావు వంటి నేత తమ పార్టీలోకి వస్తే.. జిల్లాలో పార్టీకి ఉపయోగం ఉంటుందని.. ఆయన ద్వారా మరికొందరు నేతలు కూడా బీజేపీలోకి వస్తారని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి కళా వెంకట్రావు నిజంగానే బీజేపీలోకి వెళతారా లేక టీడీపీలోనే కొనసాగుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.
Published by:Kishore Akkaladevi
First published:January 16, 2021, 12:32 IST