ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) మరోసారి అసెంబ్లీ వద్దకు చేరాయి. అధికార, ప్రతిక్షాల మధ్య జరిగిన మాటల యుద్ధం అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ (Assembly Privilege Committee) వద్దకు చేరడంతో తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) నేతలను ప్రివిలేజ్ కమిటీ వివరణ కోరింది. ఈ నేపథ్యంలో మంగళవారం భేటీ అయింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchennaidu) అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. గత సమావేశానికి హాజరుకాని అచ్చెన్న.. ఈసారి మాత్రం విచారణకు వచ్చి తన వివరణ ఇచ్చారు. స్పీకర్ ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై వివరణ ఇచ్చేందుకు ఆయన ప్రివిలేజ్ కమిటీ విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా తాను ఏ తప్పూ చేయలేదన్న అచ్చెన్న.. తన వ్యాఖ్యలు బాధించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
స్పీకర్ పదవిపై తనకు గౌరవముందన్న ఆయన.. ప్రెస్ నోట్ లో పేర్కొన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానన్నారు. అచ్చెన్న వివరణతో ప్రివిలేజ్ కమిటీ సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. ఆయనపై ఎలాంటి చర్యలకు ఆదేశాలివ్వకపోవచ్చని సమాచారం. మరోవైపు శ్రీకాకుళం జిల్లాకే చెందిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ (Kuna Ravi Kumar) ప్రివిలేజ్ కమిటీ విచారణకు హాజరుకాలేదు. ఆయనకు మరోసారి అవకాశమివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వచ్చే సమావేశానికి కూడా గైర్హాజరైతే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనే విధంగా వ్యవహరించిన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కమార్ (Nimmagadda Ramesh Kumar) విచారణకు హాజరుకాలేదు. గవర్నర్ కు పంపిన లేఖను లీక్ చేయడంతో పాటు తమ హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పీకర్ కు ఫిర్యాదు చేయగా.. స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు. దీనిపై గతంలో ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డకు నోటీసులిచ్చింది. ఆయనను వ్యక్తిగతంగా కమిటీ ముందుకు హాజరుకావాలని ఆదేశించింది. ఐతే ఆయన ఇప్పటివరకు ప్రత్యక్ష విచారణకు హాజరుకాలేదు. ఈనెల 21న మరోసారి కమిటీ ముందు హాజరయ్యేఅవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.
ప్రివిలేజ్ కమిటీ అధికారాలివే..!
అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ విస్తృత అధికారాలున్నాయి. రూల్ 256 ప్రకారం కమిటీని నియమిస్తారు. సభ్యుల హక్కులను కాపాడటం ప్రివిలేజ్ కమిటీ బాధ్యత. కమిటీకి ఎవర్నైనా పిలిచి వివరణ కోరే అధికారముంది. 1988 యూత్ కాంగ్రెస్ నేత సుధీర్ కుమార్ కు ప్రివిలేజ్ కమిటీ 10 రోజుల జైలు శిక్ష విధించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి లోక్ సత్తా అధినేత, ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణపై దాడి చేసిన తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ డ్రైవర్ దాడిచేసినప్పుడు అతనికి నెలరోజుల జైలు శిక్ష విధించారు. ఇక టీడీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు బహిష్కరించారు. గతంలో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఎస్ఈసీకి వారం రోజులు జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత రెండు రోజులకు కుదించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, AP Politics, Kinjarapu Atchannaidu, Nimmagadda Ramesh Kumar