ఏపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కు మధ్య మరో సారి వివాదం ముదురుతోంది. నిన్న మంత్రి కొడాలి నాని రమేష్ కుమార్ పై తీవ్ర వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని నిమ్మగడ్డ సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కొడాలిపై గవర్నర్ బీబీ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. మంత్రి నాని తనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగ్స్ ను గవర్నర్ కు నిమ్మగడ్డ పంపించారు. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంపై ప్రభుత్వం, అధికార యంత్రాంగంతో తాను సంప్రదింపులు జరుపుతుంటే మంత్రి కొడాలి నాని తనపై ఉద్దేశ పూర్వకంగా విమర్శలు చేస్తున్నారని నిమ్మగడ్డ లేఖలో పేర్కొన్నారు.
ఉద్యోగులను ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా కొడాలి నాని మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని మంత్రి కొడాలి నానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. ఏకంగా మంత్రిపైనే నిమ్మగడ్డ ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే ఈ అంశంపై గవర్నర్ ఎలా స్పందిస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల నిర్వహణపై మంత్రి కొడాలి నాని నిన్న తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Election) నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ సిగ్గులేకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖలకు స్పందిస్తూ ఎన్నికలు నిర్వహించాలని అనుకోవడం సిగ్గుచేటని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా లేరని మంత్రి అన్నారు. నిమ్మగడ్డ రమేష్‌కు(Nimmagadda Ramesh Kumar) రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని విమర్శలు గుప్పించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP governor viswabhushan, AP Politics, Kodali Nani, Nimmagadda Ramesh Kumar