news18-telugu
Updated: June 19, 2020, 9:52 PM IST
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులతో సీఎం వైఎస్ జగన్ (File)
ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన నాలుగు స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నాలుగు సీట్లు ఆ పార్టీ గెలుచుకుంది. టీడీపీ ఓటమి పాలైంది. వైసీపీ నుంచి పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ విజయం సాధించారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన వర్ల రామయ్య ఓటమిపాలయ్యారు. మొత్తం 175 ఓట్లు ఉండగా, అందులో 173 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఓటు వేయలేదు. వైసీపీ సభ్యులు 151 మంది, జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో వైసీపీ నలుగురు అభ్యర్థులకు ఒక్కొక్కరికి 38 చొప్పున ఓట్లు వచ్చాయి. టీడీపీకి పోలైన 21 ఓట్లలో నాలుగు ఓట్లు చెల్లలేదు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరితో పాటు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఓటు చెల్లలేదు. దీంతో వర్ల రామయ్యకు కేవలం 17 ఓట్లు పడ్డాయి. ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు వైసీపీ సభ్యులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.
వాస్తవానికి అసెంబ్లీలో వైసీపీకి ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఆ నలుగురు ఎంపీలు విజయం లాంఛనమే. కానీ, టీడీపీ దళిత నేత వర్ల రామయ్యను పోటీకి దింపింది. ఎంపీని గెలిపించేందుకు అవసరమైన సభ్యుల సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ అభ్యర్థిని బరిలో నిలిపింది. అయితే, టీడీపీకి ఉన్న 23 మందిలో కేవలం 21 మంది మాత్రమే ఓటు వేశారు. ఈఎస్ఐ స్కాంలో అరెస్టై ప్రస్తుతం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు ఓటు వేయలేదు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఓటు వేయలేదు. అనగాని సత్యప్రసాద్ పార్టీ మారుతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, తాను కొన్ని రోజుల క్రితం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కలిశానని, ఆ తర్వాత ఆయనకు కరోనా రావడంతో తాను హోం ఐసోలేషన్లో ఉన్నట్టు చెప్పారు. అందుకే ఓటు వేయలేకపోతున్నానంటూ చంద్రబాబుకు లేఖ రాశారు.
First published:
June 19, 2020, 6:24 PM IST