పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి బాండ్ పేపర్ మీద హామీల వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే, చాలా మంది జనం ఏమనుకుంటారంటే.. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల హామీల వర్షం కురిపిస్తారు కానీ.. అలా ఎన్నికలు అయిపోయి.. గెలిచిన తర్వాత పట్టించుకోరు. మామీలన్నీ ఒట్టి మాటలు అయిపోతాయి. నీటిమీద రాతలు అయిపోతాయనే భావన ప్రజల్లో చాలా వరకు ఉంటుంది. అయితే, ప్రజలను నమ్మించడానికి, వారిలో భరోసా కల్పించడానికి ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు మరింత ముందుకు వెళ్తున్నారు. ఏకంగా బాండ్ పేపర్లు రాసి ఇస్తున్నారు. తమను గెలిపిస్తే ఏం చేస్తామో ఆ బాండ్ పేపర్ల మీద రాసి ప్రజలకు అందజేస్తున్నారు. అలాంటి బాండ్ పేపర్ గురించి మీరు ఇప్పుడు చదవబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంకలో మూడో వార్డు తరుపున పోటీ చేస్తున్న పడాల రంగారెడ్డి తమ వర్గాన్ని గెలిపిస్తే పంచరత్నాలు అమలు చేస్తామంటూ రూ.20 బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చారు. నోటరీ చేయించి 14 బాండ్లను చేయించి 14 వార్డుల్లోని పెద్దలకు అందించారు.
బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిన హామీలు
మార్చి 1, 2021 నుంచి ఫిబ్రవరి 28, 2022 వరకు ఊరందరికీ ఉచితంగా కేబుల్ టీవీ
సంవత్సరం పాటు గ్రామంలో ప్రజలు తీసుకునే రేషన్ పూర్తిగా ఉచితం
సంవత్సరం పాటు గ్రామ ప్రజలు వినియోగించే మినరల్ వాటర్‌ను వాటర్ ప్లాంట్‌లో ఉచితంగా ఇస్తారు
ఊబలంక గ్రామ ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ టెస్టులు
పడాల సత్యనారాయణరెడ్డి జ్ఞాపకార్థం హైస్కూల్లో పది మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10వేల ఆర్థిక సాయం
ఇక 2022- 23 సంవత్సరానికి గాను ఇంటి పన్నులు, నీటి కుళాయి పన్నులు రద్దు చేయించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

పడాల రంగారెడ్డి రాయించిన బాండ్ పేపర్
ఫిబ్రవరి 21న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీన ఈ బాండ్ పేపర్‌ను రాయించారు. దీనికి సంబంధించి అడ్వొకేట్‌తో న్యూస్ 18 తెలుగు మాట్లాడింది. ఇది ఫేక్ కాదని, నిజమేనని ఆయన ధ్రువీకరించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి తమ వర్గాన్ని గెలిపిస్తే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో తాను ఇవన్నీ చేయిస్తానని హామీపత్రం రాసి ఇచ్చారన్నారు.