ఆదివారం కాదు.. పండగలు కూడా లేవు.. అయినా ఇంటిళ్లపాది పండుగ చేసుకుంటున్నారు విజయనగరం, విశాఖ జిల్లాల్లో కొందరు. ఎంతలా అంటే.. తాగిన వాళ్లకు తాగినంత.. తినేవాళ్లకు తినేంత అన్నంతంగా.. గత మూడు నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. సాధరణంగా ఆదివారం రోజునో లేదా.. పండగ రోజునో ఇంటిళ్లపాది ఇలా తమకు ఇష్టమైనవి తిని.. మందు అలవాటు ఉన్నవారు బీరో.. వైనో తాగుతారు.. కానీ గత మూడు రోజుల నుంచి ఎంజాయ్ చేస్తున్నారు. అవును మరి ఫ్రీగా వస్తే ఎవరు మాత్రం వద్దంటారు..? ఏంటి ఈ రోజుల్లో ఎవరు ఇవన్నీ ఫ్రీగా ఇస్తారు అనుకుంటున్నారా.. కానీ నిజంగానే చాలాచోట్ల ఇంటింటికీ ఈ పార్శిళ్లు వస్తున్నాయి..
ప్రస్తుతం ఏపీలో హోరాహోరీగా సాగిన ప్రచారం అయితే ముగిసింది కాని.. ప్రలోభాల పర్వం ఆగడం లేదు. మున్సిపల్ ఎన్నికలకు ఇంకా ఒకరోజు సమయం ఉండడంతో ఆఖరిలో ప్రలోభాలు మరింత పెరిగాయి. డబ్బుల పంపకం, ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ముఖ్యంగా మద్యం ప్రవాహం ఏరులై పారుతోంది. విజయనగరం, విశాఖ జిల్లాలో తెర వెనుక కార్యకలాపాలు బాగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు పోటా పోటీగా ఈ ఆఫర్లు ప్రకటిస్తున్నట్టు తెలుస్తోంది.
చాలా చోట్ల నగదు పంపిణీ విచ్చలవిడిగా సాగుతోంది. ఎన్నికలకు రెండ్రోజుల ముందు నుంచే ఈ పంపకాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా సాలూరులో కుటుంబాల్లో పెద్దలు ఎవరున్నారో వారిని పిలిచి నగదు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత నగదు వచ్చిందో లేదో.. ఓటర్లకు ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు అభ్యర్ధులు లేదా వారి ప్రధాన అనుచరులు.. పనిలో పనిగా తమకే ఓటేయాలని అభ్యర్థిస్తున్నట్టు సమాచారం.
ఇక పార్వతీపురం, నెలిమర్లలో డబ్బుల పంపిణీ వ్యూహాత్మకంగా చేస్తున్నారు. చేతిలో డబ్బులు పెడితే ఇతర వర్గాలు నిఘా పెట్టాయనే భయంతో ఫోన్ పే, గూగుల్ పే ద్వారా బదిలీ చేస్తున్నారు. బొబ్బిలిలోనూ ఇదే పరిస్థితి. కొన్ని వార్డుల్లో ఓటుకు రూ.వెయ్యి చొప్పున ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. విజయనగరంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఓటర్లు సైతం ఇద్దరి నుంచి తీసుకుంటున్నారు మరి ఓటు ఎవరికి అన్నది చూడాలి.
మద్యం, నగదు ఓల్డ్ ట్రెండ్ అయిపోవడంతో.. ఇప్పుడు అభ్యర్థులు ప్రలోభాల విషయంలో కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. మూడో కంటికి చిక్కడకుండా వ్యవహారాన్నీ రహస్యంగా చక్కబెడుతున్నారు. ఓటుకు ఇంత అని ఇచ్చేసి.. మద్యం సీసా ఇవ్వడం చాలా కామన్. అయితే నెల్లిమర్లలో కొంతమంది మూడ్రోజులుగా కొన్ని వార్డుల్లో ఇంటింటికీ అరకిలో మాంసం, 2 లీటర్ల కూల్ డ్రింక్స్, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం బిర్యానీ పొట్లాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. మద్యం సీసా ధర 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు.. వారు ఇష్టపడే బ్రాండ్ ల బట్టి ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.
మరికొందరు ఇంటికి ఉపయోగపడే పరికరాలను అందిస్తున్నారు. గిన్నెలు, చీరల పంపిణీ అన్నది ఎప్పటి నుంచో ఉన్నదే.. ఇప్పుడు ఆ ట్రెండ్ మారి.. ఇంటిలో వాళ్లకు ఏది అవసరం ఉందో.. అంటే 5 వేల రూపాయలలోపు ఉండే వస్తువులు ఏవైనా ఇంట్లో అవసరం ఉంటే కొని ఇచ్చేందుకు వెనుకాడడం లేదు.
ఇదీ చదవండి: అపార్ట్ మెంట్ కు మరమ్మత్తులు చేయాలా? పెయింటింగ్స్ వేయించాలా? మేమున్నాం.. మేం చూస్తామంటూ పోటీ
మరోవైపు ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ వైన్ షాపుల్లో నిబంధనలు కఠినం చుయడంతో.. చాలామంది అభ్యర్థులు మందే మందును నిల్వ చేసుకున్నారు. ప్రతి రోజు తమ అనుచరులను దగ్గరలో ఉన్న అన్ని షాపులకు పంపించి కొద్దికొద్దిగా తెప్పించుకొని నిల్వ చేసుకున్నారు. సాలూరు పురపాలక సంఘంలో కొంతమంది ఒడిశా నుంచి రహస్యంగా మద్యం దిగుమతి చేసుకున్నట్టు సమాచారం.