AP MUNICIPAL ELECTIONS 2021 JANASENA TDP ALLIANCE IN JANGAREDDYGUDEM MUNICIPALITY SK
Andhra Pradesh: మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు.. బీజేపీకి షాక్
ప్రతీకాత్మక చిత్రం
AP Municipal Elections: బీజేపీతో కాకుండా టీడీపీతో జనసేన పొత్తుపెట్టకోవడం చర్చనీయాంశమయింది. వైసీపీని ఓడించాలంటే ఇలాంటి ఎత్తులు తప్పవని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.
వరుస ఎన్నికలతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఐతే మున్సిపల ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కొన్నేళ్ల క్రితమే విడిపోయిన జనసేన, టీడీపీ మళ్లీ జతకట్టాయి. తన ప్రస్తుత మిత్రపక్షం బీజేపీని కాదని.. టీడీపీతో పొత్తు పెట్టుకుంది జనసేన. ఇదేంటి బీజేపీ, జనసేన కూటమి ఉంది కదా.. పంచాయతీ ఎన్నికల్లో కూడా కలిసే పోటీచేశారు కదా.. అని డౌట్ రావచ్చు. కానీ ఇది నిజమే. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తున్నాయి. ఐతే అన్ని మున్సిపాలిటీల్లో కాదు.. ఒకే ఒక్క మున్సిపాలిటీలో ఈ పాత మిత్రుల మధ్య కొత్త స్నేహం చిగురించింది.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఎందుకంటే ఇక్కడ బీజేపీని కాదని.. టీడీపీతో పొత్తు పెట్టుకుంది జనసేన. జంగారెడ్డిగూడెంలో మొత్తం 29 వార్డులున్నాయి. ఇందులో 24 వార్డుల్లో టీడీపీ, 5 వార్డుల్లో జనసేన పోటీచేస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు కలిసి కట్టుగా ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థులకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ, జనసేన కలిసి ఖచ్చితంగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాయని.. ఐదేళ్ల పాటు పాలన అందిస్తామని ఇరు పార్టీల నేతలు తెలిపారు.
కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించుకున్నారని.. ఆయా వార్డుల్లో జనసేన అభ్యర్థులకు మద్దతు తెలుపుతామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బహిరంగంగానే చెబుతున్నారు. ఐతే ఇక్కడ బీజేపీతో కాకుండా టీడీపీతో జనసేన పొత్తుపెట్టకోవడం చర్చనీయాంశమయింది. వైసీపీని ఓడించాలంటే ఇలాంటి ఎత్తులు తప్పవని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.
మార్చి 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఏడాదే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. అక్కడి నుంచే ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అభ్యర్థుల తుది జాబితాను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇక మార్చి 10వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రీ పోలింగ్ అవసరమైన చోట మార్చి 13న ఎన్నికలు జరుగుతాయి. మార్చి 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తారు.