AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ నిర్ణయాన్ని తప్పుపడుతున్న విపక్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేషన్ కుమార్ నిర్ణయాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి.. మున్సిపల్ ఎన్నికలను స్వాగతిస్తూనే.. ఆగిపోయిన చోట నుంచి ప్రక్రియ నిర్వహించడం మాత్రం సరికాదంటున్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మరింత హాట్ హాట్ గా మారింది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. అయితే పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులపై అభ్యర్థులు పోటీ చేయకపోయినా పరిస్థితి రణరంగాన్ని తలపిస్తోంది. ఇఫ్పుడు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. దీంతో రాష్ట్రంలో రాజకీయం మరో టర్న్ తీసుకునే అవకాశం ఉంది.

    మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ పై ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. కానీ గతంలో మధ్యలో ఆగిపోయిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను, తిరిగి అక్కడ నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. దీంతో ఆగిన చోట నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషనుపై.. అధికార వైసీపీ తప్ప అన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

    ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని ఎస్ఈసీని కోరింది. మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను కొత్తగా తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని.. బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలని ఎస్‌ఈసీకి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ఏడాది పాటు నిలిపివేయడంతో చాలా మంది ఆసక్తి కోల్పోయారని అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి కనబరుస్తున్నారని.. అలాంటి వారికి అవకాశం ఇవ్వాలని.. నామినేషన్లకు మరో మూడు రోజులు అదనంగా సమయం కేటాయించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు.

    ఎక్కడ ఆగాయో అక్కడ నుంచే ఎన్నికలు కొనసాగించాలన్న ఎస్ఈసీ నిర్ణయంపై జనసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. సుమారు ఏడాది కిందట ఎన్నికలు నిలిపివేసిన చోట నుంచి మళ్లీ కొనసాగించడం సరికాదని.. కొత్తగా ప్రక్రియ ఆరంభించేందుకు ఉన్న అవకాశాలను ఎస్‌ఈసీ పరిశీలించాలని జనసేన విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాలపై కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కరోనా దృష్ట్యా గతేడాది మార్చి 15న ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని రాజకీయ పార్టీగా తాము స్వాగతించామని చెప్పారు. గతంలో జరిగిన నామినేషన్ల సమయంలో అభ్యర్థులు, ఓటర్లను అధికారపక్షం మభ్యపెట్టిందని ఆరోపించారు. ఆగినచోట నుంచి మళ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం ప్రజాస్వామ్యబద్ధం కాబోదని మనోహర్‌ అభిప్రాయపడ్డారు.

    ఇక మున్సిపల్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇస్తే బాగుండేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. నామినేషన్లకు పోలింగ్‌కు ఏడాది గ్యాప్ ఉండటంతో పలు చోట్ల వైసీపీ ప్రలోభాలకు పాల్పడిందని ఆరోపించారు. చాలాచోట్ల విపక్షాలు నామినేషన్లు వేయకుండా వైసీపీ ఏకగ్రీవంగా ప్రకటించుకుందని రామకృష్ణ తప్పుబట్టారు.
    Published by:Nagesh Paina
    First published: