‘ఎంత చేస్తే ఏముంది?’... ఏపీ మంత్రుల్లో నిర్వేదం.. కారణం ఇదేనా?

YS Jagan Cabinet | తమ శాఖలపై పట్టు పెంచుకోకముందే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించి దాదాపు అందరినీ మారుస్తానని సీఎం జగన్ స్వయంగా చెప్పిన మాట వారికి నిద్ర పట్టనివ్వడం లేదు.

news18-telugu
Updated: June 20, 2019, 3:58 PM IST
‘ఎంత చేస్తే ఏముంది?’... ఏపీ మంత్రుల్లో నిర్వేదం.. కారణం ఇదేనా?
ఏపీ కేబినెట్ మంత్రులు
news18-telugu
Updated: June 20, 2019, 3:58 PM IST
ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వంలో మంత్రులకు విచిత్రమైన పరిస్ధితి ఎదురవుతోంది. ఓవైపు మంత్రి పదవులు తీసుకుని తమ శాఖలపై పట్టు పెంచుకోకముందే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించి దాదాపు అందరినీ మారుస్తానని సీఎం జగన్ స్వయంగా చెప్పిన మాట వారికి నిద్ర పట్టనివ్వడం లేదు. దీంతో తమ పదవీకాలం పూర్తి కాకముందే పనులు చక్కబెట్టుకోవడమెలా అని ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏపీలో ఈ నెల 8న జరిగిన కేబినెట్ విస్తరణలో మంత్రి పదవులు పొందిన వారంతా ఇప్పుడు తమకు కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లుగానే ఫీలవుతున్నారట. రెండున్నరేళ్ల తర్వాత కచ్చితంగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, అప్పుడు ప్రస్తుత మంత్రుల్లో దాదాపు అందరూ మాజీలు కాక తప్పదని సీఎం జగన్ వారికి గతంలో స్పష్టం చేశారు. తద్వారా సామాజిక సమీకరణాల కొద్దీ కేబినెట్లో చోటు దక్కని వారికి రెండున్నరేళ్ల తర్వాత అవకాశం ఉంటుందనే సంకేతాలు ఇవ్వగలిగారు. దీంతో మంత్రులు కూడా తమ పదవీకాలం రెండున్నరేళ్లు మాత్రమే అని భావిస్తున్నారు. ఈ 30 నెలల కాలంలో అవినీతి రహితంగా, సమర్ధంగా పాలన సాగించడమెలా అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. కేబినెట్ విస్తరణ పూర్తయి 12 రోజులు కావస్తున్నా ఇవాళ్టి వరకూ పలువురు మంత్రులు బాధ్యతలు చేపట్టలేదు. వీరిలో ముగ్గురు ఇవాళ సచివాలయంలో తమ కార్యాలయాల్లోకి ప్రవేశించారు.

కేబినెట్ కూర్పులో భాగంగా సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని జగన్ తన సహచరులను ఎంపిక చేశారు. వీరిలో చాలా మందికి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం కూడా లేదు. మరికొందరైతే తమ శాఖలపైనా కనీస అవగాహన లేదు. ప్రభుత్వం, అధికార వర్గాలు ఎలా పనిచేస్తాయన్న అంశాలపై పట్టు లేదు. దీంతో మంత్రులు ఇంకా కుదురుకోనట్లే కనిపిస్తున్నారు. అయితే ప్రభుత్వం నడిపించాలి కాబట్టి నెమ్మదిగా తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందులో వారికి పలు సమస్యలు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో అంటకాగిన అధికారుల నుంచి వారికి పూర్తిస్ధాయిలో సహకారం అందడం లేదు. ఇంకా పేషీల్లో సిబ్బంది కేటాయింపు కూడా పూర్తికాకపోవడంతో పలువురు మంత్రులు తమ శాఖల విషయంలో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు.

తమకు దొరికిన 30 నెలల పదవీకాలంలో గంటలు కూడా లెక్కపెట్టుకుని పనిచేయాల్సి వస్తోందని కొందరు మంత్రులు వాపోతున్నారు. ఇచ్చిన 30 నెలల్లో తమ శాఖలపై అవగాహన కోసమే సగం కాలం పూర్తయ్యేలా ఉందని, ఇలా అయితే తాము సమర్ధులుగా పేరు తెచ్చుకోవడం ఎలా అంటూ మంత్రులు తమ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఓ ఎత్తయితే అవినీతి రహితంగా పాలన సాగించకపోతే కేబినెట్ లో నుంచి ఉద్వాసన తప్పదన్న సీఎం జగన్ హెచ్చరికలు వారిలో ఆందోళన మరింత పెంచుతున్నాయి. దీంతో మంత్రుల పరిస్ధితి అడకత్తెరలో పోక చెక్కలా మారుతోంది. తమ శాఖలో ఎక్కడ అవినీతి జరిగినా అది తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అన్న ఆందోళన కూడా వారిలో పెరిగిపోతోంది. దీంతో అధికారులతో సమీక్షల సందర్భంగా అవినీతికి దూరంగా ఉండి తీరాల్సిందేనని కచ్చితంగా హుకుం జారీ చేస్తున్నారు. మొత్తం మీద రెండున్నరేళ్ల పదవీకాలం తమకు ముళ్లకిరీటంగా మారిందన్న భావన కూడా పలువురు మంత్రుల్లో వ్యక్తమవుతోంది.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)

First published: June 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...