ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS Party)ని విస్తరించాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారన్న టీఎస్ సీఎం కేసీఆర్ (Telangna CM KCR) కామంట్స్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఏపీలోని అధికార, ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్సీపీ (YSR Congress) నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెడితే తప్పేంటని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు కలపాలని తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) తీర్మానం చేయాలని అలా అందరం కలిసిపోతే రాష్ట్రమంతటా పోటీ చేసే అవకాశముందన్నారు. సీఎం జగన్ (AP CM YS Jagan) కూడా సమైక్యాంధ్రను (United Andhra Pradesh) కోరుకుంటున్నారని ఆయన అన్నారు. పార్టీలు పెరిగితే మంచిదేనని... కేసీఆర్ ఏపీలో పార్టీ పెట్టాలని కోరుకుంటున్నామని పేర్ని అన్నారు. రెండు రాష్ట్రాలను కలిపేస్తే అసలు సమస్యే ఉండదని సూచించారు.
ఎవరైనా వద్దన్నారా..?: సజ్జల
టీఆర్ఎస్ పార్టీని ఏపీలో పెడతామన్న కేసీఆర్ కామెంట్స్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. కేసీఆర్ వస్తామంటే ఎవరైనా వద్దన్నారా…? అని సజ్జల ప్రశ్నించారు. పార్టీ పెట్టొద్దని ఎవరూ చెప్పలేదని.. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని.. దానికి ఎవరి అనుమతులు అవసరం లేదని సజ్జల అన్నారు.
స్పందించిన చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఏపీలో వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయని అన్నారు. తెలంగాణలో వెలుగులు, ఏపీలో చీకట్లు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల తరువాతైనా జగన్ మేల్కొంటే బావుంటుందని చంద్రబాబు అన్నారు. జగన్ అధికారంలోకి రాగానే కరెంటు ఒప్పందాలపై రివర్స్ టెండరింగ్ అంటూ నానా యాగీ చేయడం కూడా ప్రస్తుత పరిస్థితులకు దారి తీశాయని గుర్తుచేశారు.
కేసీఆర్ ఏమన్నారంటే..!
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయని, దళిత బంధు ప్రకటించిన తర్వాత ఏపీ నుంచి వేల విజ్ఞాపనలు వచ్చాయని, ఏపీలోనూ టీఆర్ఎష్ పెడితే గెలిపించుకుంటామని అంటున్నారని, తెలంగాణ లాంటి పథకాలు తమకు కావాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ఒకప్పుడు హైదరాబాద్ రాజ్యాంలో ఉండిన నాందేడ్, రాయచూర్ జిల్లాల నుంచి డిమాండ్లు వస్తున్నాయని, వారు తెలంగాణలో కలుస్తామంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, ఏపీ కంటే తెలంగాణే గొప్ప అంటూ కొన్ని లెక్కలు చదవి వినిపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap minister perni nani, CM KCR, Telangana