Kodali nani fires on Pawan kalyan: జగన్‌ను భయపెట్టేవాడు పుట్టలేదు -కోర్టు చెప్పిందనే ఆన్‌లైన్ టికెటింగ్

పవన్ పై కొడాని నాని ఫైర్

Kodali nani on Pawan kalyan:సినిమా థియేటర్లలో ఆన్ లైన్ టికెటింగ్ విధానంపై నటుడు పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు.. ఆయన పార్టీ జనసేనకు అధికార వైసీపీకి మధ్య తీవ్ర వివాదానికి దారితీశాయి. వరుస బహిరంగ సభల్లో పవన్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ, సీఎం జగన్, వైసీపీ సర్కారుపై పదునైన వ్యాఖ్యలు చేశారు. వీటిపై ఏపీ మంత్రులు సైతం అదే స్థాయిలో ప్రతిస్సందిస్తున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ సినీ పరిశ్రమకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు..

  • Share this:
టాలీవుడ్ నిర్మాతలు, ఇండస్ట్రీకే చెందిన ఇతర రంగాల్లోని పెద్దలకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య చాలా కాలంగా చర్చలు జరుగుతుండటం, వాటి ఫలితంగా ఆన్ లైన్ టికెటింగ్ విధాన్ని ప్రభుత్వం తీసుకురావడం తెలిసిందే. అయితే, తన సినిమాలకు నష్టం చేయడానికే జగన్ ఈ చర్యకు పూనుకున్నాడని, సినిమా ఇండస్ట్రీ జోలికొస్తే తాట తీస్తానని పవన్ కల్యాణ్ వరుస వార్నింగ్ లు ఇచ్చారు. పవన్ కామెంట్లపై ఏపీ మంత్రులు ఒక్కక్కరుగా స్పందిస్తున్నారు. ఆదివారం రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో..

ఏపీ మంత్రి కొడాలి నాని, ఎంపీ నందిగం సురేశ్ లు ఆదివారం హైదరాబాద్ లో ఓ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. జొన్నలగడ్డ హరి హీరోగా, శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకుడిగా చేస్తున్న'ఆటో రజనీ' సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్డుడియోలో జరగ్గా, మంత్రి నాని కెమెరా స్విచ్‌ ఆన్‌ శారు, ఎంపీ నందిగం సురేష్‌ క్లాప్‌ కొట్టారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, సినీరంగం, పవన్ విమర్శలపై పదునై కౌంటరిచ్చారు..

సినీ పరిశ్రమను నమ్ముకున్న వారందరికీ న్యాయం జరగాలన్నదే ఏపీ సీఎం జగన్ అభిమతమని, ఎవరివారు ఇష్టం వచ్చినట్లు టికెట్‌ రేట్లు పెంచుకోవడాన్ని వైసీపీ ప్రభుత్వం సమర్థించబోదని కొడాలి నాని చెప్పారు. పెద్ద సినిమాలతో కొంతమందికి మాత్రమే లాభం చేకూరే విధానానికి ఆన్ లైన్ పద్ధతిలో అడ్డు కట్ట పడుతుందని, తద్వారా చిన్న సినిమాలు కూడా బతుకుతాయని మంత్రి చెప్పారు. అందరి మేలు కోరి, పలు దఫాల చర్చల తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పవన్ అవాకులు పేలుతున్నారని నాని ఫైరయ్యారు.

‘పవన్ కళ్యాణ్ అహు అంటే బెదిరిపోయేవాళ్లెవరూ లేరిక్కడ. నలుగురు ప్రొడ్యూసర్లో, నలుగురు హీరోలనో దృష్టిలో పెట్టుకునో వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోలేదు. అందరి ప్రయోజనాలూ మాకు ముఖ్యం. పవన్ కళ్యాణ్ సినిమా హిట్టయినా, ప్లాప్ అయినా ప్రభుత్వానికి వచ్చేదిగానీ పోయేదిగానీ ఏమీ ఉండదు. టికెట్ రేట్లు, ఆన్ లైన్ విధానంపై చర్చ ఈనాటిది కాదు. కోర్టు ఆదేశాల ప్రకారమే కమిటీలు వేసి నిర్ణయాలు తీసుకున్నాం. పవన్ ఏదేదో మాట్లాడుతున్నాడు. జగన్ ను భయపెట్టే వ్యక్తి ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదని తెలుసుకుంటే మంచిది’అని మంత్రి నాని వ్యాఖ్యానించారు.

సినిమా రంగానికి చెందిన వారు ఏపీ సర్కారును ఎలాంటి సాయం కోరినా చేస్తామని, రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నంలాంటి ప్రాంతాలు మాత్రమే కాక ఎక్కడైనా షూటింగులు చేసుకోవచ్చని.. అందుకు కావాల్సిన సౌకర్యాలు కోరితే.. తగిన సహాయాన్ని అందిస్తామని మంత్రి నాని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల అండదండలతోపాటు దేవుడి ఆశిస్సులు ఉన్నాయని, పవన్ లాంటి వాళ్లు జీవిత కాలం ప్రయత్నించినా జగన్‌ను ఏమీ చేయలేరని కొడాలి నాని అన్నారు.
Published by:Madhu Kota
First published: