news18-telugu
Updated: November 16, 2019, 4:48 PM IST
పవన్ కళ్యాణ్, కొడాలి నాని, చంద్రబాబునాయుడు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మాజీ మంత్రి దేవినేని ఉమా మీద ఏపీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. చంద్రబాబు, దేవినేని ఉమా మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు మామ ఎన్టీఆర్‌ను మోసం చేసి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి లాక్కున్నారని కొడాలి నాని ఆరోపించారు. మరోవైపు దేవినేని ఉమా.. అతని అన్న చనిపోతే రాజకీయాల్లోకి వచ్చారని, తనకు అడ్డుగా ఉందని వదినను చంపించారని ఉమా మీద కొడాలి నాని సంచలన ఆరోపణలు చేశారు. అలాంటి ఇద్దరు నేతలు తన మీద కామెంట్స్ చేస్తారా? అంటూ కొడాలి నాని భగ్గుమన్నారు. ‘మేం సన్న బియ్యం ఇస్తామని చెప్పలేదు. కేవలం నాణ్యమైన బియ్యం ఇస్తామని చెప్పాం. కానీ, బియ్యం రావడానికి సమయం పడుతుంది. ఏప్రిల్ నుంచి అందిస్తాం.’ అని కొడాలి నాని స్పష్టం చేశారు.
‘జగన్ మీద ఆరోపణలు చేయడానికి ఏమీ లేక కులం, మతం, తిరుపతి ప్రసాదం, గుళ్లో సంతకం, గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ చాలా నీతులు చెబుతారు. కానీ, కులం, మతం గురించి ఆయన మాట్లాడినంతగా ఎవరూ మాట్లాడరు. రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ప్రశ్నిస్తే సీఎం జగన్ చెప్పాలా’ అని కొడాలి నాని ప్రశ్నించారు.
దేవినేని నెహ్రూ నాలుగు మెట్లు దిగి వచ్చి తన కొడుకు అవినాష్‌ను చంద్రబాబు చేతుల్లో పెడితే.. ఓడిపోతారని తెలిసినా కూడా అతడిని గుడివాడలో పోటీ చేయించారని కొడాలి నాని ఆరోపించారు. వల్లభనేని వంశీని ఎంత బ్లాక్ మెయిల్ చేశారో కూడా ఆయన వెల్లడించారన్నారు. దేవినేని అవినాష్‌ను వైసీపీలో చేర్చుకున్నామని, వంశీని ఇంకా చేర్చుకోలేదని కొడాలితెలిపారు. జగన్ విలువల్లేని వ్యక్తి కాదని, రాజీనామా చేశాకే చేర్చుకుంటామన్న మాటకు కట్టుబడి ఉంటామని మంత్రి స్పష్టం చేశారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 16, 2019, 4:47 PM IST