విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన బాధితులను ఆదుకునేందుకు ఏపీ సీఎం జగన్ ఎంతో ఉదారంగా వ్యవహరిస్తుంటే... చంద్రబాబు దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1998లో ఇదే కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగిందని... అనేక మంది గాయాలపాలై ఇప్పటికీ బాధపడుతున్నారని తెలిపారు. అప్పుడు చంద్రబాబు ఈ కంపెనీని ఎందుకు మూయించలేదని కొడాలి నాని ప్రశ్నించారు. గతంలో హిందూస్థాన్ కంపెనీని కొరియన్ కంపెనీ కొనుగోలు చేసే విషయంలోనూ చంద్రబాబు మధ్యవర్తిత్వం వహించారని ఆరోపించారు.
జనావాసాల మధ్య ఉన్న ఈ కంపెనీని విస్తరించేందుకు 2017లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబే అనుమతి ఇచ్చారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. అప్పుడు చంద్రబాబు ఆలోచన ఏమైందని ఆయన ప్రశ్నించారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితులకు సరైన పరిహారం ఇచ్చేందుకు చంద్రబాబు చేతులు రాలేదని... ఇప్పుడు సీఎం జగన్ కోటి రూపాయల పరిహారం ప్రకటిస్తే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు.
బాధితులను పరామర్శించేందుకు విశాఖకు రావడానికి చంద్రబాబుకు ధైర్యం చాలడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. బాధితులను పరామర్శిస్తే తనకు ఎక్కడ కరోనా వస్తుందో అని ఆయన భయపడుతున్నారని విమర్శించారు. వలస కూలీలు సైతం నడుచుకుంటూ తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని... కానీ చంద్రబాబు మాత్రం ఇంటి నుంచి కాలు బయట పెట్టడం లేదని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వేసిన కమిటీ కంటే టీడీపీ పార్టీ తరపున వేసిన ముగ్గురు ఎమ్మెల్యేల కమిటీ గొప్పదన్నట్టుగా చంద్రబాబు ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా ఈ ఘటనపై రాజకీయాలు చేయడం మానాలని కొడాలి నాని హితవు పలికారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.