Kodali Nani: చంద్రబాబుపై కొడాలి నాని సంచలన ఆరోపణలు

చంద్రబాబునాయుడు, కొడాలి నాని

Kodali Nani Comments: కమ్మ సామాజికవర్గంపై తమ ప్రభుత్వం కక్ష సాధిస్తోందనే ఆరోపణలను మంత్రి కొడాలి నాని ఖండించారు.

  • Share this:
    టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ మంత్రి కొడాలి నాని. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ చంద్రబాబు ఇంట్లోనే దాక్కున్నారని కొడాలి నాని ఆరోపించారు. రమేష్ ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసని అన్నారు. ఏ తప్పు చేయకుంటే రమేష్ ఆస్పత్రి యజమాని ఎందుకు పారిపోతారని ఆయన ప్రశ్నించారు. రమేశ్ ఆస్పత్రి యజమాని వెనుక బడా నాయకులు ఉన్నారని విమర్శించారు. మహిళలను ముందు పెట్టి రమేష్ పారిపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.

    కమ్మ సామాజికవర్గంపై తమ ప్రభుత్వం కక్ష సాధిస్తోందనే ఆరోపణలను ఆయన ఖండించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కొరియన్లు అరెస్టు చేశారని.. అందులో కమ్మవాళ్లు ఉన్నారా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసినప్పుడు బీసీలు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు రెడ్డిలు చంద్రబాబుకు గుర్తొచ్చారని అన్నారు. కులాల ప్రస్తావన లేకుండా చంద్రబాబు మాట్లాడలేరా ? అని కొడాలి నాని మండిపడ్డారు. టీడీపీకి ఓట్లు వేసేది కమ్మ సామాజికవర్గం వారే అని... అందుకే చంద్రబాబు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. హీరో రామ్ చంద్రబాబు మాటలు వినకపోవడం మంచిదని సలహా ఇచ్చారు. ఆయన మాట వింటే పరిస్థితి ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్‌ను అడిగి తెలుసుకోవాలని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: