ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం (Andhra Pradesh Cabinet)లో మార్పులు చేర్పులపై గత కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. సీఎం జగన్ (CM YS Jagan) కేబినెట్ లో ఎవరుంటారు..? ఎవరు పదవిని కోల్పోతారు..? వంటి విషయాలపై రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ (YSRCP) ప్రభుత్వం ఏర్పడినప్పుడే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో భారీ మార్పులుంటాయని సీఎం జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరో రెండు నెలలో ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ లో ఉండేదెవరు.. పదవులు కోల్పోయేదెవరనేదానిపై లెక్కలు మొదలయ్యాయి. కేబినెట్ లో 80 శాతం మార్పులుంటాయని కొందరు.. 90 శాతం మార్పులను మరికొందరు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆశావాహులు, జగన్ నుంచి హామీలున్నవారు పదవుల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. దీంతో జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారీగా లెక్కలేసుకుంటున్నారు.
తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Minister Balinani Srinivas Reddy) మంత్రివర్గంలో మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో వందశాతం మార్పులుంటాయని వ్యాఖ్యానించారు. త్వరలోనే కేబినెట్ లో భారీ మార్పులుంటాయన్న ఆయన.. విధానపరమైన నిర్ణయాలను గౌరవిస్తామన్నారు. తనకు పదవి ఇచ్చినా ఇవ్వకున్నా సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. బాలినేని వ్యాఖ్యలతో మంత్రులందరినీ మార్చబోతున్నట్లు అర్ధమవుతోంది.
గత రెండు నెలలుగా మంత్రివర్గ మార్పులే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకసారి మంత్రివర్గంలో మార్పులు చేశారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్లడంతో వారి స్థానంలో చెల్లుబోయిన గోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజును మంత్రివర్గంలోకి తీసుకున్నారు. బాలినేని తాజా ప్రకటనతో వీరి స్థానాలకు కూడా గ్యారెంటీ లేదన్న టాక్ వినిపిస్తోంది.
గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, గౌతమ్ రెడ్డితో పాటు ఒకరిద్దరి స్థానాలు సేఫ్ అని అందరూ భావించారు. అలాగే ఇటీవల ఇద్దరు ముగ్గురు మంత్రులపై ఆరోపణలు, ఆడియో రికార్డ్స్ బయటకు రావడంతో వారికి ఊస్టింగ్ ఖాయమన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే సీఎం జగన్ మంత్రుల పనితీరు, ఇతర వ్యవహారాలపై నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. వాటిపై తన ఆంతరంగికులతో చర్చించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఆశావాహుల జాబితా పెద్దదే..
అయితే ఈ సారి మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా భారీగానే ఉంది. శిల్పా చక్రపాణిరెడ్డి, గ్రంథి శ్రీనివాస్, సామినేని ఉదయభాను, అంబటి రాంబాబు, వైవీ సుబ్బారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, కళావతి, ఉషశ్రీ చరణ్, కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్న దొర, స్పీకర్ తమ్మినేని, రోజా, పార్ధసారధి, జోగి రమేష్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి లాంటి వంటి వారు కూడా కేబినెట్ బెర్తుల కోసం పోటీలో ఉన్నారు. మరి బాలినేని చెప్పినట్లుగా వందశాతం మార్పులుంటాయా..? లేక కొంతమందిని కొనసాగించి వారిస్థానాల్లో కొత్తవారికి అవకాశం కల్పిస్తారా..? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.