వైసీపీలోకి గంటా ఎంట్రీకి అవంతి అడ్డుపుల్ల... కారణం ఇదే..?

కానీ మారుతున్న పరిస్ధితుల నేపథ్యంలో విశాఖ జిల్లాపై పట్టుకోసం వైసీపీ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో గంటాతో పాటు గతంలో టీడీపీలో పనిచేసిన నేతలను, ప్రస్తుత ఎమ్మెల్యేలకూ గాలం వేస్తోంది.

news18-telugu
Updated: September 3, 2019, 11:27 AM IST
వైసీపీలోకి గంటా ఎంట్రీకి అవంతి అడ్డుపుల్ల... కారణం ఇదే..?
అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు
  • Share this:
టీడీపీని వీడి వైసీపీలో చేరాలనుకుంటున్న ఒకప్పటి తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరాపు ప్రయత్నాలను మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుకుంటారా ? తనను పార్టీలో చేర్చుకోమంటూ గంటా నిజంగానే వైసీపీ, బీజేపీ నేతల చుట్టూ తిరుగుతున్నారా ? ఒకప్పుడు విశాఖ రాజకీయాలను శాసించిన గంటా భవిష్యత్తు అవంతి చేతుల్లోనే ఉందా ? రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే ఇది నిజమనే అనిపిస్తోంది.  ఏపీ వైసీపీలో ఇప్పుడు నేతలకు కొదవ లేదు. అయితే విశాఖ జిల్లాలో మాత్రం పరిస్ధితి భిన్నంగా ఉంది. పేరుకు ఎమ్మెల్యేలు, నేతలతో పార్టీ నిండుగా కనిపిస్తున్నా వారిని ముందుడి నడిపించే వారు కనిపించడం లేదు.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ( జీవీఎంసీ) ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న వైసీపీకి ఇది ఇబ్బందికరంగా మారింది. దీంతో పార్టీ సిద్ధాంతాలకు లోబడి విశాఖ జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ కు గేట్లు తెరవాలని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలో విశాఖ డైరీ ఛైర్మన్ అడారి తులసీరావు కుటుంబం డైరెక్టర్లతో కలిసి వైసీపీల చేరిపోయింది. ఇక తర్వాతి వంతు గంటా శ్రీనివాస్ తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలదే అన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ను ఉద్దేశించి గంటా చేసిన వ్యాఖ్యలు తాజాగా కలకలం రేపాయి. అవంతిని తాను మంత్రిగా పరిగణించడం లేదంటూ గంటా చేసిన వ్యాఖ్యలు ఒకప్పుడు గురు శిష్యులైన ఈ ఇద్దరు నేతల మధ్య అగాధాన్ని చెప్పకనే చెబుతున్నాయి. దీనికి కౌంటర్ గా రెండు రోజుల నుంచి అవంతి శ్రీనివాస్ గంటాపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

గతంలో విజయనగరం జిల్లాకు ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరాపు.. మొన్నటి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలిపించుకోలేకపోయారంటూ అవంతి విమర్శించారు. అంతటితో ఆగకుండా పార్టీలు మారడంలో సిద్ధహస్తుడైన గంటా... తాజాగా వైసీపీ, బీజేపీల చుట్టూ తిరుగుతున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. గంటాను వైసీపీలో చేర్చుకునే ప్రశ్నే లేదంటూ అవంతి కుండబద్దలు కొట్టారు. దీంతో ఇప్పుడు అవంతి వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి విశాఖ నార్త్ నుంచి మళ్లీ గెలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న గంటా శ్రీనివాస్ ను అడ్డుకునేందుకే అవంతి మాటల యుద్ధం సాగిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంటా రాకకు జరుగుతున్న ప్రయత్నాలపై అవంతి అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

విశాఖ జిల్లాలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన గంటా శ్రీనివాసరావు... మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అతి కష్టం మీద స్వల్ప తేడాతో గట్టెక్కారు. ఆయనతో పాటు నగర పరిధిలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీ తరఫున నెగ్గారు. కానీ మారుతున్న పరిస్ధితుల నేపథ్యంలో విశాఖ జిల్లాపై పట్టుకోసం వైసీపీ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో గంటాతో పాటు గతంలో టీడీపీలో పనిచేసిన నేతలను, ప్రస్తుత ఎమ్మెల్యేలకూ గాలం వేస్తోంది. దీంతో వీరి రాకను అడ్డుకునేందుకే అవంతి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ నుంచి గంటాతో ఉన్న స్నేహాన్ని బ్రేక్ చేసి మరీ గత ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన అవంతి... ఆయన పార్టీలోకి వస్తే తనకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారా అన్న వాదన కూడా వినిపిస్తోంది.
First published: September 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading