news18-telugu
Updated: November 17, 2020, 4:08 PM IST
ఏపీ మంత్రి అనిల్
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీమంత్రి దేవినేని ఉమపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పబ్జీ, ఐపిఎల్ ఆటలు ఆడుతున్నారని దేవినేని ఉమ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడరని మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని చెప్పినట్టు దేవినేని ఉమ ఏమన్నా ఇంట్లో కూర్చుని చెమ్మ చెక్క ఆడుతున్నాడేమో మాకు అయితే తెలియదని ధ్వజమెత్తారు. దేవినేని ఉమ ఏదో పద్ధతిగా మాట్లాడినట్టు తమను బూతుల మంత్రి అంటున్నాడని అనిల్ విమర్శించారు. ఆయన గతంలో ఏరకంగా మాట్లాడాడో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిదని అన్నారు. ఆయన ఎవరిని చంపాడో ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని సూచించారు.
వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాము, తర్వాత ఖరీఫ్ కు గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామని మంత్రి అనిల్ అన్నారు. 2017లో కేంద్ర కేబినెట్లో అప్పటి టీడీపీ ప్రభుత్వం, కేంద్రంలోని టీడీపీ మంత్రులు ఏ అంశాలు అంగీకరించారో బయటకు వచ్చి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పోలవరంలో ఆర్ అండ్ ఆర్, పునరావాసం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి గానీ, చంద్రబాబుకు గానీ లేదని మంత్రి అనిల్ అన్నారు. రూ. 50వేల కోట్లలో 30 వేల కోట్లు ఉన్న ఆర్ అండ్ ఆర్ గురించి పట్టించుకోని మీరు 70 శాతం పనులు పూర్తి చేశామని ఎలా చెబుతారని మంత్రి అనిల్ టీడీపీని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎందుకని అన్నారు. కేవలం గ్రావిటీ ద్వారా విశాఖకు నీళ్లు తీసుకోవాలనే పైపులైన్ వేయాలని అనుకుంటున్నామని తెలిపారు. 194 టిఎంసి నిల్వ చేసేందుకు అంగుళం తగ్గకుండా ప్రొజెక్ట్ కడుతామని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. కండలేరులో 25 సంవత్సరాల తర్వాత 60 టీఎంసీల నీరు నిల్వ చేస్తున్నామని అన్నారు. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి సీఎం జగన్ చేతుల మీద పోలవరం ప్రారంభిస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర దివంగత సీఎం వైఎస్ విగ్రహం పెడతామని అన్నారు.
Published by:
Kishore Akkaladevi
First published:
November 17, 2020, 4:08 PM IST