ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతో విజయకేతనం ఎగరవేసిన వైసీపీ... అక్కడితో తన విజయ ప్రస్థానాన్ని ఆపేయలేదు. లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే ప్రభంజనం సృష్టించింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలుండగా... ఏకంగా 22 స్థానాలను కైవసం చేసుకొని... రికార్డు సృష్టించడమే కాకుండా... లోక్ సభలో 4వ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే స్థాయి నుంచీ ప్రస్థానం మొదలుపెట్టిన వైసీపీ ఈ స్థాయిలో దూసుకెళ్తుందనీ, చరిత్రను తిరగరాస్తుందని ఎవరూ ఊహించలేదు. అంతెందుకు పక్క రాష్ట్రం తెలంగాణలో టీఆర్ఎస్ తాము 16 ఎంపీ స్థానాలు గెలుస్తామని బల్లగుద్ది చెప్పినా... ఆ పార్టీ 9 స్థానాలకే పరిమితమైంది. అలాంటిది వైసీపీ మాత్రం ఎవరి ఊహలకూ అందని రీతిలో... ఏకంగా 22 స్థానాలు గెలుచుకోవడంతో పార్లమెంట్లో లెక్కలు మారిపోయాయి.
ప్రస్తుతం పార్లమెంట్లో 542 స్థానాలకు ఎన్నికలు జరిగితే... బీజేపీ సొంతంగా 303 స్థానాలు సాధించి... అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ 52 స్థానాలకే పరిమితమైనా... ఆ పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఐతే... లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో అధికార పార్టీకి చెక్ పెడుతూ... అనూహ్య విజయం సాధించిన DMK... 37 స్థానాల్లో... 23 సాధించి... లోక్ సభలో మూడో అతి పెద్దగా మారింది. ఇక ఏపీ నుంచీ దూసుకొచ్చిన వైసీపీ... మొత్తం 22 స్థానాలు సాధించి... నాలుగో అతి పెద్ద పార్టీగా చరిత్ర సృష్టించింది.
వైసీపీ తర్వాతి స్థానాల్లో వరుసగా శివసేన 18, జేడీయూ 16, బీజేడీ 12, బీఎస్పీ 10, టీఆర్ఎస్ 9, సమాజ్ వాదీ 5, ఎన్సీపీ 4 నిలిచాయి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామనుకున్న టీడీపీ... NCP కంటే వెనకపడిపోయి... కేవలం 3 సీట్లతో సరిపెట్టుకొని... లోక్ సభలో 12వ స్థానానికి పడిపోయింది. ఐతే... టీడీపీ తర్వాత స్థానంలో అన్నాడీఎంకే, సీపీఐ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.