ఇటు చంద్రబాబు... అటు కుమారస్వామి... ఇద్దరిదీ అదే టెన్షన్

కుమారస్వామి, చంద్రబాబు(ఫైల్ ఫోటో)

తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన తన కుమారుడు లోకేశ్‌ విజయం సాధిస్తాడా లేదా అనే టెన్షన్ చంద్రబాబులో కనిపిస్తుంటే... మాండ్య నుంచి లోక్ సభకు పోటీ చేసిన తన కుమారుడు నిఖిల్ గెలుస్తాడా లేదా అనే ఆందోళన కుమారస్వామిలో అంతకంతకు ఎక్కువవుతోంది.

  • Share this:
    వారిద్దరు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. ఎన్నికలు వారికి కొత్త కాదు. ఎన్నో ఎన్నికల్లో తమ పార్టీలను గెలిపించి అధికారంలోకి వచ్చిన క్రెడిట్ వారి సొంతం. కానీ ఈసారి జరిగిన ఎన్నికలు మాత్రం ఆ ఇద్దరు నేతలను తెగ టెన్షన్ పెడుతున్నాయి. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ రాజకీయ వారసులు గెలుస్తారో లేదో ఆందోళన వారిలో కనిపిస్తూనే ఉంది. ఆ ఇద్దరు నేతల్లో ఒకరు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా... మరొకరు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన తన కుమారుడు లోకేశ్‌ విజయం సాధిస్తాడా లేదా అనే టెన్షన్ చంద్రబాబులో కనిపిస్తుంటే... మాండ్య నుంచి లోక్ సభకు పోటీ చేసిన తన కుమారుడు నిఖిల్ గెలుస్తాడా లేదా అనే ఆందోళన కుమారస్వామిలో అంతకంతకు ఎక్కువవుతోంది.

    నిజానికి ఈ ఇద్దరు నేతల వారసులు ఎన్నికల్లో సులువుగా గెలవాల్సిన వారే. కానీ... ఈ ఎన్నికల్లో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా మారింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్నప్పటికీ చంద్రబాబు తనయుడు ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలో గట్టి పోటీ ఎదుర్కొన్నారు. మంగళగిరిలో ఆయన గెలుస్తారా లేదా అనే దానిపై కోట్ల రూపాయల బెట్టింగ్ కూడా జరుగుతోందనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ లోకేశ్ గెలిచినా... మెజార్టీ పెద్దగా రాకపోవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

    ఇక కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారస్వామి తనయుడు నిఖిల్ విషయంలో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. మాండ్యలో ఆయనకు పోటీగా బరిలోకి దిగిన నటి సుమలతకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ నేతలతో పాటు జేడీఎస్ క్యాడర్ సైతం సుమలత గెలుపు కోసం కృషి చేసిందనే వాదనలు ఉన్నాయి. దీంతో తన కుమారుడు గెలుస్తాడా లేదా అనే అంశంపై ఇంటలిజెన్స్ నివేదికలతో పాటు సర్వే నివేదికలు కూడా తెప్పించుకుని పరిశీలిస్తున్నారట కుమారస్వామి. అంతేకాదు నిఖిల్ గెలుపు కోసం ఆయన ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సొంత పార్టీలను గెలిపించుకుని సీఎం కుర్చీ ఎక్కిన ఈ ఇద్దరు నేతలు... తమ కుమారులను గెలిపించుకోవడంలో విజయం సాధించారా లేదా అనేది తెలియాలంటే ఈ నెల 23 వరకు వెయిట్ చేయాల్సిందే.
    First published: