ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు (AP Politics) మరోసారి సోషల్ మీడియా (Social Media) వేదికగా వేడెక్కాయి. రెండు రోజులుగా జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Minster Anil Kumar Yadav) పై ట్రోలింగ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) ను 2021 నాటికి పూర్తి చేస్తామని గతంలో మంత్రి అనిల్ చేసిన కామెంట్స్ పై టీడీపీ కార్యకర్తలు మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. ఐతే ఈ ట్రోల్స్ కు మంత్రి అనిల్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుతో పాటు కొన్ని మీడియా సంస్థలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టు ఆలస్యమైన మాట వాస్తమేనన్న అనిల్.. అది ఎందుకు ఆలస్యమైందో తెలుసుకోవాలని సూచించారు. కుల అజెంటాలతో తనపై అవాకాలు చవాకులు పేలితే ఏమీ చేయలేరని మండిపడ్డారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై నెల్లూరులో మాట్లాడిన మంత్రి అనిల్.. గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ మా ప్రభుత్వం భరించాల్సి వస్తోందని.. అవే తమకు శాపంగా మారాయన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి దేవినేని ఉమా.. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తానని చెప్పారని.. మరి ఎందుకు పూర్తి చేయాలేదని మంత్రి అనిల్ నిలదీశారు. దేవినేని ఉమా వ్యాఖ్యలను ట్రోల్ చేయని టీడీపీ కార్యకర్తలు తన వ్యాఖ్యలను ఎందుకు ట్రోల్ చేస్తున్నారని ప్రశ్నించారు.
2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని గతంలో తాను చెప్పిన మాటలు వాస్తవేమనన్న ఆయన.. ఆలస్యమవడానికి గల కారణాలను కూడా వివరించారు. తనను విమర్శించే వాళ్లు డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతిందో తెలుసుకోవాలన్నారు. రెండు కిలోమీటర్ల వెడల్పులో ఉండాల్సిన నదిని 600 మీటర్లకు కుదించారన్నారు. స్పిల్ వే కట్టిన తర్వాత నీటిని మళ్లించాల్సిందిపోయి.. మందుగానే ఆ పనిచేశారన్నారు. చంద్రబాబు చేతగాని తనంతో.. ఒకేసారి సగం స్పిల్ వే, సగం కాఫర్ డ్యామ్ కట్టడం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు. ప్రస్తుతం ఈ మరమ్మత్తుల పనులపై దృష్టి పెట్టామన్నారు. సీడబ్ల్యూసీ నుంచి అనుమతులు ఆలస్యం కావడంతో ఆ ప్రభావం ప్రాజెక్టు పనులపై పడిందన్నారు.
ఇది చదవండి: నా రూటే సపరేటు.. పార్టీ నిర్ణయంతో సంబంధం లేదంటున్న వైసీపీ ఎమ్మెల్యే..!
గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికే తమకు టైమ్ సరిపోతుందని మంత్రి అనిల్ అన్నారు. తన గురించి ఇంత టైమ్ వేస్ట్ చేస్తున్న వాళ్లు మంచి పనులపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. ట్రోలింగ్ చేసే వాళ్లకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగానే పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తామని మంత్రి అనిల్ ధీమా వ్యక్తం చేశారు. తనను ట్రోల్ చేసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు నానా తంటాలు పడుతున్నారన్నారు. చంద్రబాబు అన్నీ సక్రమంగా చేసుంటే తాము ఈపాటికే ప్రాజెక్టును పూర్తి చేసేవాళ్లమన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anil kumar yadav, Polavaram