AP HIGHCOURT KEY COMMENTS ON MPTC ZPTC ELECTIONS NGS
Andhra Pradesh: ఎన్నికలు జరపాలని ఆదేశించలేం: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై స్పష్టత ఇచ్చిన హైకోర్టు
నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ హైకోర్టు
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత వీడడం లేదు. తాజాగా హైకోర్టు ఈ ఎన్నికలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. పరిషత్ ఎన్నికలు నిర్వహించాలి అంటూ ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టత ఇచ్చింది.
ఏపీలో పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నదానిపై రోజు రోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ.. ఇప్పుడు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలోనూ మెగా విక్టరీ పై ఫోకస్ చేసింది. ఇప్పటికే పలువురు మంత్రులకు తిరుపతి ఉప ఎన్నిక బాధ్యత అప్పగించిన అధినేత జగన్.. కనీసం 4 లక్షల మెజార్టీ రావాలని టార్గెట్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే జోష్ లో పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహిస్తే.. భారీగా ఎంపీటీసీ, జడ్పీటీసీలను సొంతం చేసుకోవచ్చని అధికార పార్టీ భావిస్తోంది. అందుకే త్వరగా ఆ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను కోరుతోంది..
ఈ పరిషన్ ఎన్నికల నిర్వహణకు కోర్టు కేసులు ప్రధాన అడ్డంకిగా నిలిచాయి. అందుకే అవి కూడా త్వరగా క్లియర్ అయితే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించాలన్న పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు జరపాలని ఎస్ఈసీని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా పడింది.
గత వారం కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా బలవంతపు ఉపసంహరణ, అడ్డగింతలపై విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. ఏకగ్రీవాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాటిపై విచారణకు ఆదేశించారు. ఎస్ఈసీ ఆదేశాలపై గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు తాజాగా తుది తీర్పు ప్రకటించింది. గతేడాది నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఫాం-10 ఇచ్చిన స్థానాల్లో విచారణాధికారం ఎస్ఈసీకి లేదన్న పిటిషనర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఎస్ఈసీ ఆదేశాలను కొట్టివేసిన హైకోర్టు గతంలో ఏకగ్రీవమైన చోట్ల డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలని హైకోర్టు ఎస్ఈసీని ఆదేశించింది.
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 126 జెడ్పీటీసీ, 2,406 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే వాటిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు ఫిర్యాదులు అందాయి. చాలాచోట్ల అధికార పార్టీకి చెందిన వర్గీయులు బలవంతంగా ఏకగ్రీవాలు చేశారని విపక్షాలు ఆరోపించాయి. ఈ ఆరోపణలపై స్పందించిన ఎస్ఈసీ విచారణ చేయాలని కోర్టును కోరింది. తాజా కోర్టు తీర్పుతో ఇక ఏకగ్రీవాలు ఫైనల్ అయినట్టే.. దీంతో ఇంకా మిగిలిన 526 జెడ్పీటీసీ స్థానాలు, 7,287 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏకగ్రీవాలపై కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. త్వరలో ఎన్నికలు కూడా నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించినా ఇప్పుడు ఫలితం లేకుండా పోయింది. తాజా కోర్టు ఆదేశాలతో పరిషత్ ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.