Andhra Pradesh: పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్.. ఎల్లుండి ఎన్నికలపై క్లారిటి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(ఫైల్ ఫొటో)

ఏపీ పరిషత్ ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అనుకున్న సమయానికి ఎన్నికలు జరుగుతాయా? లేక రీ షెడ్యూల్ చేయాల్సి వస్తుందా? అన్న అంశాలు ఆసక్తి పెంచుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలన్నింటీకీ ఈ నెల ఆరో తేదీన సమాధానం దొరకనుంది.

  • Share this:
    ఏపీలో పరిషత్  ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు కొత్తగా  బాధ్యతలు చేపట్టిన ఎస్ఈసీ నీలం సాహ్ని ఈ ఎన్నికలను త్వరగా పూర్తి చేయాలని దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో విపక్షాలన్నీ ఒక్కటై షెడ్యూల్ పై ఆందోళన చేస్తున్నాయి. మళ్లీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించినట్టు టీడీపీ నేరుగా ప్రకటించింది. మరోవైపు ప్రధాన పార్టీలు మూడు హైకోర్టును ఆశ్రయించాయి..

    ఏపీలో పరిషత్‌ ఎన్నికలపై ఏపీ హైకోర్టులో సుదీర్ఘంగా కొనసాగిన ఇరు వర్గాల వాదానలు ముగిశాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ బీజేపీ, జనసేన దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై హైకోర్టులో నిన్ననే వాదనలు ముగిసాయి. తరువాత దీనిపై ఎస్‌ఈసీ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. దీంతో ఆదివారం కూడా ఈ కేసును హైకోర్టు విచారణ చేసింది. ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచే కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఈసీ తరఫు అడ్వకేట్ జనరల్ తమ వాదన వినిపించారు. కేవలం పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని.. ఇలాంటి సమయంలో కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎస్‌ఈసీ తరఫున అడ్వకేట్ వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్‌ చేసింది. తీర్పును ఎల్లుండి వెలువరించనుంది. దీంతో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నదానిపై సర్వత్రా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్షాలన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

    మరోవైపు అధికార పార్టీ నేతలు మాత్రం అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. ఆ తర్వాత 9న అవసరమైన చోట్ల రీ పోలింగ్ నిర్వహిస్తారు. ఈ నెల పదో తేదీని కౌంటింగ్ చేయనున్నారు. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. గతంలో ఎన్నికల అధికారుల అధికారాల విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు చెప్పిందని.. మరోసారి అలాంటి తీర్పే వస్తుందని అధికార పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. విపక్షాలు మాత్రం న్యాయస్థానంలో తమ వాదన నెగ్గుతుందని.. మళ్లీ మొదటి నుంచి షెడ్యూల్ రిలీజ్ చేుయక తప్పదని చెబుతున్నాయి. దీంతో అసలు  ఎన్నికలు సమయానికి జరుగుతాయా? లేక విపక్షాలు వాధిస్తున్నట్టు షెడ్యూల్ రీ నోటిఫికేషన్ చేయాల్సి వస్తుందా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా ఇప్పటికే ఆయా పార్టీల తరపున నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓ వైపు టీడీపీ అధిష్టానం ఈ ఎన్నికలను బహిష్కరించినట్టు చెబతున్నా..  ఆ పార్టీ అభ్యర్థులు మాత్రం చాలా జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నారు. 
    Published by:Nagesh Paina
    First published: