ఏదైనా పని కోసం కేంద్రం విడుదల చేసిన నిధుల్ని ఇతర అవసరాలకు మళ్లించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడుందని ఏపీ హైకోర్టు నిలదీసింది. ఉపాధి హామీ పథకం నిధులను ఏపీ సర్కారు ఇతర అవసరాలకు మళ్లిస్తోందని దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. నిధులు మళ్లించినట్లు తేలితే ఉన్నతాధికారులపై విచారణకు ఆదేశిస్తామని హెచ్చరించింది. చేసిన పనులకు బకాయిలు చెల్లించకుండా నిధుల్ని ఇతరాలకు మళ్లించడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ కె.సురేశ్ రెడ్డితో కూడిన ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 2018-19 సంవత్సరానికి గాను ఉపాధి పథకం కింద నిర్వహించిన పనుల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను తమకు చెల్లించకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తోందని పేర్కొంటూ గుంటూరు జిల్లా అంగలకుదురు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ వి.భవానీ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. తాజాగా నిర్వహించిన పనులకు బిల్లుల చెల్లింపు కోసం మెమో జారీ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 2018-19 బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 16వ తేదీకి వాయిదా వేసింది.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.