news18-telugu
Updated: August 27, 2020, 3:59 PM IST
ప్రతీకాత్మక చిత్రం
AP High Court Notice to CM Jagan | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి తరలింపు అంశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులకు నోటీసులు జారీ చేసింది. అలాగే, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలకు కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రాజధాని తరలింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా చట్టాలు చేసిందని ఆరోపిస్తూ కొందరు అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడిన వారు, అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట మారుస్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. సీఎంతోపాటు మంత్రివర్గం, రాజకీయపార్టీలపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. దీంతో ముఖ్యమంత్రి, మంత్రులు, టీడీపీ, బీజేపీలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
మరోవైపు రాజధాని తరలింపు సహా ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లపై వచ్చే నెల 21 నుంచి రోజువారీ విచారణ చేపడతామని ఏపీ హైకోర్టు తెలిపింది. రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే నెల 21 నుంచి రోజు వారీ విచారణపై న్యాయవాదులతో ధర్మాసనం చర్చించింది. భౌతిక దూరం పాటిస్తే హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు సుప్రీంకోర్టు న్యాయవాది నితీశ్ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విశాఖలోని కాపులుప్పాడలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అతిథిగృహాన్ని నిర్మించ తలపెట్టిందని, స్టేటస్ కో ఉన్నప్పుడు అతిథిగృహ నిర్మాణానికి శంకుస్థాపన ఏమిటని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కార్యనిర్వాహక రాజధాని తరలింపులో ఇది కూడా భాగమేనని వాదనలు వినిపించారు. అయితే కేవలం వీవీఐపీల కోసమే ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని చేపడుతోందని ప్రభుత్వం తెలిపింది. దీనిపై సెప్టెంబరు 10వ తేదీ లోపు కౌంటరు దాఖలు చేయాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇక రైతులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు మొత్తం 70 పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
మూడు రాజధానుల కేసుపై విచారణ వీలైనంత త్వరగా ముగించాలని హైకోర్టును కోరిన వైసీపీ ప్రభుత్వం మీద టీడీపీ నేత నారా లోకేష్ సెటైర్లు వేశారు. అమరావతిని చంపేందుకు త్వరగా కోర్టులో విచారణ పూర్తిచేయాలని అడుగుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.లక్ష కోట్ల ప్రజాధనం దోచేసిన 11 కేసుల విచారణ త్వరగా పూర్తయ్యేందుకు సహకరించాలన్నారు. కోర్టుకి వెళ్లకుండా ఉండేందుకు, విచారణ ఆలస్యం అయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కోవిడ్ వైరస్ భయం వల్ల ఓసారి, కోర్టుకి రావాలంటే రూ.60 లక్షలవుతుందని మరోసారి, గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నాను రాలేనని, ఇప్పుడు ప్రభుత్వాధినేతగా ఉన్నాను కోర్టుకి హాజరు కాకుండా మినహాయింపు నివ్వాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ‘రకరకాల పిటిషన్లు వేస్తూ 10 ఏళ్ళు గడిపేశారు. 29 వేల మంది రైతుల సమస్య కేసు రోజుల్లో తేలిపోవాలా? మీ లక్ష కోట్ల దోపిడీ కేసేమో ఏళ్లుగా సాగాలా?’ అంటూ లోకేష్ విమర్శించారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
August 27, 2020, 3:59 PM IST