AP HIGH COURT HEARING ON PA PANCHAYAT ELECTIONS COUNTING NGS
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ వీడియో తీయాల్సిందే: హైకోర్టు కీలక తీర్పు
నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ హైకోర్టు
మూడు, నాలుగు విడిత ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక్క ఓటరు అభ్యంతరం చెప్పినా కౌంటింగ్ మొత్తాన్ని వీడియో తీయాలని స్పష్టం చేసింది. దీంతో అధికార పార్టీపై విమర్శలు చేస్తున్న విపక్షాలకు కాస్త ఊరట లభించినట్టైంది.
ఏపీ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడూ లేనంతగా ఉద్రిక్తంగా మారాయి. చాలా గ్రామాల్లో ఘర్షణలు, దాడులు పెరిగాయి.. కొన్ని చోట్ల బ్యాలెట్ పత్రాలు ఎత్తుకెళ్లిపోయారు. చాలాచోట్ల ఫలితాల ప్రకటనపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో సహా ఇతర పార్టీలు సైతం అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు పర్వాన్ని వీడియో తీయాల్సిందేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు సందర్భంగా అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని.. ఫలితాలను తారుమారు చేసేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారంటూ విపక్షాలు ఎస్ఈసీకి ఫిర్యాదులు చేశాయి. అయినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు కొందరు. ఈ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం.. నిష్పక్షపాతంగా కౌంటింగ్ జరపాలని ఆదేశించింది. పంచాయతీలో ఉండే ఒక్క ఓటరైనా వీడియో షూట్ చేయాలని కోరితే వెంటనే కౌంటంగ్ను చిత్రీకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టెక్నాలజీ షాకులు చెప్పొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. వీడియో గ్రఫీ విషయంలో ఎస్ఈసీ ఆదేశాలను పాటించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఎస్ఈసీకి తెలిపింది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎస్ఈసీదేనని న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండు దశల ఫలితాలు వచ్చాయి. అయితే పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీసీ కెమెరాలో రికార్డు చేయాలని లేదా వీడియో తీయాలని ఎస్ఈసీ ఈనెల 13న ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఆ ఉత్తర్వులను అమలు చేసేలా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలైంది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాలన్న ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదన్నారు.
బుధ, ,ఆదివారాలు జరగనున్న మూడు, నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపును రికార్డు చేసేలా ఆదేశించాలని కోరారు. ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఈనెల 13న ఇచ్చిన ఉత్తర్వులకు సవరణ చేస్తూ ఈనెల 15న ఉత్తర్వులు జారీచేశామన్నారు. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలిచ్చామన్నారు. పూర్తిగా సీసీ కెమేరాల ఏర్పాటుకు గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతికపరంగా సాధ్యపడదన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లది కేవలం ఆందోళన మాత్రమేనన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘాన్నిహైకోర్టు కోరింది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపునకు అనుసరిస్తున్న విధానం ఏమిటని ప్రశ్నించింది. ఇరువురి వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఒక్క ఓటరు కోరినా వీడియో షూట్ చేయాలని స్పష్టం చేసింది.
మరోవైపు రేపు మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 13 జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లోని.. 3,221 పంచాయితీలు, 31,516 వార్డు స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటిలో 579 ఏక గ్రీవాలు అయ్యాయి.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.