రివర్స్ టెండరింగ్‌తో మరో రూ.34 కోట్లు ఆదా చేసిన జగన్ సర్కార్

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ఇచ్చే 4జీ సెల్ ఫోన్ల నెలవారీ ప్లాన్లలో రివర్స్ టెండరింగ్ ద్వారా 33.76 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు ప్రకటించింది.

news18-telugu
Updated: November 9, 2019, 10:04 PM IST
రివర్స్ టెండరింగ్‌తో మరో రూ.34 కోట్లు ఆదా చేసిన జగన్ సర్కార్
వైఎస్ జగన్
  • Share this:
(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 విజయవాడ ప్రతినిధి)
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రివర్స్ టెండరింగ్ లో అనుకున్న ఫలితాలను రాబట్టడమే కాకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేస్తోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ఇచ్చే 4జీ సెల్ ఫోన్ల నెలవారీ ప్లాన్లలో రివర్స్ టెండరింగ్ ద్వారా 33.76 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు ప్రకటించింది.

ఏపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే ప్రారంభించిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియ విజయవంతంగా కొననసాగుతోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ అమలుతో 838 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఆదా చేసిన జగన్ సర్కారు.. తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ దీన్ని అమలు చేసి చూపించింది. సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి కేటాయించిన సెల్ ఫోన్లకు నెలవారీ పోస్టు పెయిడ్ ప్లాన్ ను 92 రూపాయలకు ఖరారు చేసింది. ఇదే ప్లాన్లను బిడ్ దక్కించుకున్న ఆపరేటర్ ఎయిర్ టెల్ ఓపెన్ మార్కెట్లో ఇతర వినియోగదారులకు 199 రూపాయలకు విక్రయిస్తోంది. గతంలో ఇదే ప్లాన్ ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న ఎయిర్ టెల్ గ్రామ సచివాలయ ఉద్యోగుల విషయంలో రివర్స్ టెండరింగ్ అమలు చేయడం ద్వారా 92 రూపాయలకే పొందగలిగింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 4జీ సిమ్ కార్డులపై ఈ ప్లాన్ ఇచ్చేందుకు ఎయిర్ టెల్ అంగీకరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

వాస్తవానికి 199 రూపాయల నెలవారీ ప్లాన్ కోసం ఆపరేటర్లను ఆహ్వానించిన ప్రభుత్వం మూడేళ్ల కాలనికి 121.54 కోట్ల రూపాయలకు కనీస బిడ్ ధరగా నిర్ణయించింది. 2,,64,920 సిమ్ ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వ సంస్ధ ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్)టెండర్ పిలిచింది. అయితే ఎల్ 1గా నిలిచిన ఎయిర్ టెల్ 87.77 కోట్లకు బిడ్ దాఖలు చేయడంతో రివర్స్ టెండరింగ్ ద్వారా 33.76 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయినట్లయింది. ఎయిర్ టెల్ ఆఫర్ చేసిన ధరను బట్టి చూస్తే ఒక్కో సిమ్ కార్డుపై నెలకు 107 రూపాయలు ఆదా కానున్నాయి. తాజా ధరతో మూడేళ్ల కాలపరిమితితో ఎపిటీఎస్ 4జీ సిమ్ లను కొనుగోలు చేయనుంది. ఈ ప్లాన్ లో అన్ లిమిటెడ్ నేషనల్, లోకల్ కాల్స్ తో పాటు రోజుకు 100 ఉచిత ఎస్ఎమ్ఎస్ లు కూడా ఉంటాయి. దీంతో పాటు రోజుకు 1 జీబీ ఉచిత 4జీ డేటా కూడా ఈ ప్లాన్ తో లభిస్తోంది.

గ్రామ, వార్డు సచివాలయాల్లో వాడే 4జీ సిమ్ ల రివర్స్ టెండరింగ్ లో భారీ మొత్తాన్ని ఆదా చేసిన జగన్ సర్కారు త్వరలో అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ దీన్ని అమలు చేయడం ద్వారా ప్రజాధనం కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పోలవరం, గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో రివర్స్ టెండరింగ్ విజయవంతం కావడంతో తదుపరి దశలో రాజధాని అమరావతి కాంట్రాక్టులతో పాటు ఇతర పనులకూ దీన్ని విస్తరించనున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: November 9, 2019, 10:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading