ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు వాయిదా... మున్సిపల్ ఎన్నికల తర్వాతే...

ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఉన్నపళంగా కొత్తగా 12 జిల్లాల ఏర్పాటు చేయడం కష్టమని జగన్ సర్కార్ భావిస్తోంది.

news18-telugu
Updated: July 17, 2019, 11:27 AM IST
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు వాయిదా... మున్సిపల్ ఎన్నికల తర్వాతే...
ఆంధ్రప్రదేశ్ మ్యాప్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు కంటే ముందుగానే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. మొదట జిల్లాల ఏర్పాటు.. తర్వాత పరిషత్‌ ఎన్నికలు నిర్వహిస్తే పాలన సౌలభ్యంగా ఉంటుందని తొలుత భావించినా.. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. కొత్త జిల్లాల ఏర్పాటు అనేది చాలా పెద్ద ప్రక్రియ. కొత్త జిల్లాల ఏర్పాటు అనేది అంత ఈజీగా చేయలేం.  ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఉన్నపళంగా కొత్తగా 12 జిల్లాల ఏర్పాటు చేయడం కష్టమని జగన్ సర్కార్ భావిస్తోంది. కొత్త జిల్లాలు వస్తే.. వాటికి అదనంగా ఐఏఎస్‌ అధికారులతో పాటు ఆయా శాఖలకు సంబంధించి జిల్లా అధికారులను నియమించాలి. దీంతో పాటు భవనాలు, మౌలిక వసతులు అంటూ అనేక సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో అంత ఖర్చు భరించడం కష్టతరమని అనుకుంటున్నారు వైసీపీ నాయకులు. ఈ నేపథ్యంలోనే జిల్లాల భారం ఇప్పటికిప్పుడు నెత్తిన పెట్టుకోవడం కంటే.. ప్రక్రియ ప్రారంభించి నిదానంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నారు. పైగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనందున రాష్ట్రానికి రావలసిన 14వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.2 వేల కోట్ల మేర నిలిచిపోయాయి. వెంటనే ఎన్నికలు నిర్వహిస్తే ఆ నిధులు తెచ్చుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నారు.

ప్రస్తుతం గ్రామ వాలంటీర్ల వ్యవస్థ రూపకల్పనకు అధికారులు చురుగ్గా కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు 15కల్లా గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకో వాలంటీరు చొప్పున నియమించనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 15న గ్రామ సచివాలయాల్లో 10 మంది చొప్పున సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో ఆగస్టు 15 తర్వాత మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసినా.. కోడ్‌ ఉల్లంఘనల ఇబ్బందులుండవని ప్రభుత్వం భావిస్తోంది. ఓ వైపు వాలంటీర్ల సేవలు ఇస్తూ.. మరో వైపు ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజల మద్దతు మరింత కూడగట్టుకోవచ్చని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

నోటిఫికేషన్‌ విడుదలైన నెలలోపు పరిషత్‌ ఎన్నికలు పూర్తి చేయాలని, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలనూ నెలలోపు పూర్తిచేసి అక్టోబరుకల్లా స్థానిక సంస్థల పాలన ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 11 నుంచి ప్రారంభించనున్న బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు పెట్టాలని ఇప్పటికే నిశ్చయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో అమలవుతున్న 69 శాతం రిజర్వేషన్‌ను 50 శాతానికి కుదించాల్సి ఉంది. తాజా చట్ట సవరణ వల్ల బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గుతాయి. ఇక గ్రామ పంచాయతీల ఎన్నికల గడువు ముగిసి 11 నెలలైనా.. ప్రభుత్వం మొదట పరిషత్‌ ఎన్నికలకే మొగ్గు చూపుతోంది. పార్టీ గుర్తుతో జరిగే ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని, ఆ తర్వాత గ్రామ పంచాయతీల ఎన్నికలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...