ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణపై విచారణ జరిపిన హైకోర్టు.. అభ్యంతరాలను తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయాల్సి ఉన్నందున ఎన్నికలు నివహించలేమని పేర్కొంది. వ్యాక్సిన్ పంపిణీ సమయంలో పోలీసులను, సిబ్బందిని ఎన్నికల కోసం కేటాయించలేమని తెలిపింది. దీనికిపై కౌంటర్ దాఖలు చేస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్ఈసీ నిర్ణయం సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధమని వాదించింది. వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.
పది నెలలుగా వివాదం
ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికల అంశంపై 10నెలలుగా వివాదం కొనసాగుతోంది. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడంతో ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. వెంటనే సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనకరాజ్ ను ఎస్ఈసీగా నియమించింది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లిన రమేష్ కుమార్.. ప్రభుత్వంపై విజయం సాధించారు. తిరిగి ఎస్ఈసీగా ఛార్జ్ తీసుకున్న అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వం ససేమిరా
ఈ మేరకు ఇటీవల ఆయన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తీసుకున్నారు. దీనికి అధికార వైసీపీ మినహా అన్ని పార్టీలు హాజరయ్యాయి. అనంతరం జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించేందుకు ఎస్ఈసీ యత్నించగా విఫలమైంది. కొవిడ్ దృష్ట్యా అధికారులు హాజరుకాలేరంటూ సీఎస్ నీలం సాహ్నీ.. ఎస్ఈసీకి లేఖరాశారు. ఈ నేపథ్యంలో ప్రొసీడింగ్స్ పై స్టేటస్ కో ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. అందుకు కోర్టు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అభ్యంతరాలు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేసింది.
ఇదిలా ఉంటే కరోనా దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అదే సమయంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తే అంగీకరించవద్దని కోరుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖరాశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ప్రభుత్వం పట్టువీడటం లేదు. నిమ్మగడ్డ ఎస్ఈసీగా ఉండగా ఎన్నికలు నిర్వహించకూడదని గట్టిగా భావిస్తోంది. ఒకవేళ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే.. సుప్రీం కోర్టుకు వెళ్లాలని భావిస్తోంది.
మరోవైపు నిమ్మగడ్డ ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలకు అంగీకరించే ప్రసక్తే లేదని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఆయన చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు నిమ్మగడ్డ కూడా ఆరు నూరైనా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు. ఇద్దరి మధ్య జరుగుతున్న లోకల్ వార్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.
Published by:Purna Chandra
First published:December 15, 2020, 18:52 IST