‘పని చేయని’ వారికి చెల్లింపులు.. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు

ఏప్రిల్ 11న పోలింగ్ రోజు పోలింగ్ బూత్ దగ్గర క్యూలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. కానీ అది ఏ మాత్రం పనిచేయలేదు.

news18-telugu
Updated: June 14, 2019, 7:45 PM IST
‘పని చేయని’ వారికి చెల్లింపులు.. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 14, 2019, 7:45 PM IST
గత ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా క్యూలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు వీలుగా
సినర్జీ ఎడ్వర్ టైజింగ్ అనే సంస్ధతో ఏపీ ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ పోలింగ్ రోజున ఆ యాప్ పనిచేయలేదు. దీంతో ఓటర్లు నిరుత్సాహానికి గురయ్యారు. అయినా సదరు సంస్ధకు రూ.37 లక్షలు చెల్లిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజున బూత్ లలో ఎంతమంది ఉన్నారో ఓటర్లు తెలుసుకునేందుకు వీలుగా సాఫ్ట్ వేర్ అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ ఎన్నికల సంఘం భావించింది. అనుకున్నదే తడవుగా గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సినర్జీ అడ్వర్ టైజింగ్ అనే సంస్ధకు బాధ్యతలు అప్పజెప్పింది. ఇందుకు గానూ అక్షరాలా రూ.37,65,434 చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. తీరా ఎన్నికల పోలింగ్ రోజున సదరు సంస్ధ రూపొందించిన యాప్ పనిచేయలేదు. పోలింగ్ రోజున ఎంతగా శ్రమించినా బూత్ లో ఎంతమంది క్యూలో ఉన్నారో ఆ యాప్ చూపించలేకపోయింది. దీంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మై ఓట్ క్యూ యాప్‌కు చెల్లింపులు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో


పోలింగ్ ముగిసి రెండు నెలలు గడిచిపోయింది. ఫలితాలు కూడా వచ్చేశాయి. కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది. అయినా సదరు సినర్జీ అడ్వర్ టైజింగ్ సంస్ధ హవా మాత్రం తగ్గలేదు. కొత్త ప్రభుత్వంలో ఎలాగోలా లాబీయింగ్ చేసి ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు చెల్లించేలా చేసుకోగలిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం పేరుతో రూ.37 లక్షల మొత్తాన్ని చెల్లించేలా జీవో కూడా విడుదలైపోయింది. ఏ మాత్రం పనిచేయని మొబైల్ యాప్ కోసం ప్రభుత్వం నిధులు చెల్లించడంపై వెలగపూడి సచివాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఓ వైపు ప్రభుత్వం దుబారాను అరికడతాం, గత ప్రభుత్వ హయాంలో అక్రమాలను వెలికి తీయడం ద్వారా ప్రజాధనాన్ని సద్వినియోగం అయ్యేలా చూస్తామంటూ ప్రకటనలు ఇస్తున్న నేపథ్యంలో ఇలాంటి పని చేయని యాప్‌కు చెల్లింపులు చేయడం వివాదాస్పదంగా మారింది.(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...