ఏపీలో మూడు రాజధానులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్... సీఆర్డీఏ రద్దు..

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.

news18-telugu
Updated: July 31, 2020, 4:10 PM IST
ఏపీలో మూడు రాజధానులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్... సీఆర్డీఏ రద్దు..
గవర్నర్ హరిచందన్‌తో సీఎం జగన్ (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. అలాగే, సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఓకే చెప్పారు. ఈ రెండు బిల్లులకు రాజ్ భవన్ నుంచి ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. దీన్ని ఏపీ శాసనసభ ఆమోదించింది. అయితే, మొదటిసారి ఏపీ శాసనమండలిలో ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ ప్రకటించారు. అయితే, మూడు నెలలు గడిచిన తర్వాత మరోసారి అవే బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో రెండోసారి ఆమోదించి మండలికి పంపింది. అక్కడ బిల్లులపై ప్రతిపక్ష టీడీపీ అభ్యంతరం తెలిపింది. కానీ, నిబంధనల ప్రకారం గడువు ముగిసిన తర్వాత బిల్లులను శాసనసభ కార్యాలయం గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్‌కు పంపింది. ఈ బిల్లుల మీద గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత  రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టు తెలిసింది.

రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ హరిచందన్ ఆమోదం తెలపడంతో ఇకపై విశాఖపట్నం అధికారికంగా పరిపాలనా రాజధాని కానుంది. అలాగే, అమరావతి శాసన రాజధాని కానుంది. కర్నూలుకు హైకోర్టు తరలివెళ్లనుంది. రాజధాని తరలింపునకు అడ్డుగా ఉన్న న్యాయపరమైన చిక్కులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ చట్టాన్ని తీసుకొచ్చి రాజధాని అమరావతిలో ఏర్పాటు చేశారు కాబట్టి.. చట్ట ప్రకారమే దాన్ని మార్చి రాజధానిని వికేంద్రీకరించామని ప్రభుత్వం చెప్పడానికి వీలవుతుంది.

ఇక సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఆమోదం తెలపడంతో సీఎం జగన్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. సీఆర్డీఏ పరిధిలో తాము చేయాలనుకున్న పనులకు పాత చట్టం అడ్డుగా ఉంది. ఆ చట్టంలో నిబంధనలను అనుకూలంగా తీసుకుని కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో సీఆర్డీఏ కూడా రద్దు కావడంతో వైసీపీ అనుకున్న విధంగా ముందుకు సాగడానికి ఆస్కారం లభిస్తుంది. ముఖ్యంగా రాజధాని పరిధిలో బయటి వారికి ఇళ్ల స్థలాల విషయంలో జగన్ ప్రభుత్వానికి ఎదురైన ఇబ్బందులను ఇప్పుడు అధిగమించే అవకాశం ఉంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 31, 2020, 3:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading