Home /News /politics /

Big Breaking : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మూడు రాజధానుల బిల్లు వెనక్కి...

Big Breaking : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మూడు రాజధానుల బిల్లు వెనక్కి...

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

మూడు రాజధానుల (AP 3 Capitals) పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును వెనక్కి తీసుకుంది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు (High Court) తెలిపారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లు (3 Capitals Bill) వెనక్కి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తెలిపింది. ఈ విషయాన్ని అడ్వకేట్ జనరల్  హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రాజధానుల అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏజీ దాఖలు చేసిన అఫిడవిట్ లో పొందుపర్చారు. ఓవైపు మంత్రివర్గ సమావేశం జరుగుతుండగానే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. బిల్లు వెనక్కి తీసుంటున్నట్లు అసెంబ్లీలో ప్రకటించి కొత్త బిల్లును సీఎం జగన్ ప్రవేశపెట్టనున్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కొడాలి నాని ఇదే విషయాన్ని వెల్లడించారు. కేబినెట్ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తామన్నారు.

    ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయని 2019 డిసెంబర్ 17న సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును నిర్ణయించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మండలిలో ప్రవేశపెట్టారు. అక్కడ ఆమోదం పొందకపోవడంతో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏను రద్దు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీనిపై రాజధాని రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఓ దశలో అమరావతి ప్రాంతం రణరంగంగా మారింది.

    ఇది చదవండి: వివేకా హత్య కేసులో అనూహ్య మలుపు.. అల్లుడిపై సంచలన ఆరోపణలు..


    అప్పటి నుంచి రాజధానికి భూములిచ్చిన అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఉద్యమం ఇప్పటికి 700 రోజులు దాటింది. ప్రస్తుతం రాజధాని రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతికి మహాపాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన 57 పిటిషన్లపై రోజువారీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు.

    ఇది చదవండి: అప్పటివరకు అసెంబ్లీకి రావొద్దు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశం.. వరద పరిస్థితులపై సమీక్ష



    రెండున్నరేళ్లుగా మూడు రాజధానులపై భీష్మించుకొని కూర్చున్న సీఎం వైఎస్ జగన్ ఎట్టకేలకు బిల్లును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాారు. ఐతే కేబినెట్ సమావేశం ప్రారంభమయ్యేవరకు మంత్రులకు కూడా ఈ విషయం తెలియనట్లు సమాచారం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న కొద్దిరోజులకే ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర బీజేపీ నేతలు అమరావతి రైతుల మహాపాదయాత్రలో పాల్గొని మద్దతు  తెలిపిన తర్వాతి రోజే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.

    ఇది చదవండి: గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ అప్పుడేనా..? ఆలస్యానికి కారణం ఇదేనా..?

    అసెంబ్లీలో సీఎం ఎలాంటి ప్రకటన చేస్తారు..? బిల్లును వెనక్కి తీసుకోవడానికి గల కారణాలను ఏం చెప్తారు.?  మూడు రాజధానుల బిల్లు స్థానంలో కొత్త బిల్లు ప్రవేశపెడతారా..? లేక పాత బిల్లులో మార్పులు చేర్పులు చేసి ప్రవేశపెడతారా అనేదానిపై  ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap capital

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు