చంద్రబాబు ఇల్లు కూల్చేస్తామని ఏపీ ప్రభుత్వం హెచ్చరిక

కృష్ణానది కరకట్ట పక్కన నదీ పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించి నిర్మించిన 26 కట్టడాలకు ఇప్పటికే సీఆర్డీయే నోటీసులు జారీ చేసిందని బొత్స ప్రకటించారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంతో సహా నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్ కూడా ఉందన్నారు.

news18-telugu
Updated: July 17, 2019, 6:01 PM IST
చంద్రబాబు ఇల్లు కూల్చేస్తామని ఏపీ ప్రభుత్వం హెచ్చరిక
చంద్రబాబు (File)
  • Share this:
విజయవాడకు సమీపంలో ఉండవల్లి కరకట్ట పక్కన మాజీ సీఎం చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్స్ కూల్చివేత తప్పదని జగన్ సర్కారు ఇవాళ మరోసారి సంకేతాలు ఇచ్చింది. శాసనమండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ మేరకు అక్రమ కట్టడాలపై ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. కృష్ణానది కరకట్ట పక్కన నదీ పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించి నిర్మించిన 26 కట్టడాలకు ఇప్పటికే సీఆర్డీయే నోటీసులు జారీ చేసిందని బొత్స ప్రకటించారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంతో సహా నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్ కూడా ఉందన్నారు.

అక్రమ కట్టడాన్ని చంద్రబాబు వెంటనే ఖాళీ చేయాలని, లేకపోతే చట్టపరంగా ముందుకెళ్తామన్నారు. మిగతా కట్టడాలతో కలిపి చంద్రబాబు నివాసాన్నీ కూల్చివేయక తప్పదని బొత్స స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు నివాసం కూల్చివేత వ్యవహారం మరోసారి చర్చనీయాంశమవుతోంది. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని చెప్పడం ద్వారా చంద్రబాబుకు ప్రత్యేకంగా మినహాయింపులేవీ ఉండబోవని పురపాలక మంత్రి బొత్స గుర్తు చేశారు. తద్వారా త్వరలో చంద్రబాబు నివాసం కూల్చివేత తప్పదని ఆయన స్పష్టం చేసినట్లయింది. కృష్ణానది కరకట్టపై అక్రమ కట్టడాలుగా గుర్తించిన 26 నిర్మాణాలకు సీఆర్డీయే అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.

ఇందులో చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్ కూడా ఉంది. నిబంధనలు ఉల్లంఘించి కట్టిన లింగమనేని ఎస్టేట్ ను ఎందుకు కూల్చివేయకూడదో చెప్పాలంటూ సీఆర్డీయే ఇచ్చిన నోటీసులకు యజమాని లింగమనేని ఇప్పటికే సమాధానం ఇచ్చారు. ఇందులో లింగమనేని ఎస్టేట్ తనదేనని, గతంలో ఉండవల్లి పంచాయతీ నుంచి తాను అన్ని అనుమతులు తీసుకునే దీన్ని నిర్మించానని చెప్పుకొచ్చారు. అయితే అందుకు తగిన ఆధారాలను మాత్రం ఆయన సీర్డీయేకు సమర్పించలేదు. ఇప్పుడు ఈ అంశం ఆధారంగా మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సీఆర్డీయే అధికారులు సిద్ధమవుతున్నారు.

వాటికి తగిన స్పందన రాకపోతే కూల్చివేత చేపట్టాలనేది అధికారుల ఆలోచనగా ఉంది. అయితే ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో చంద్రబాబు ఇంటి కూల్చివేతకు దిగితే అది బూమరాంగ్ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ బాబు నివాసం కూల్చివేతకు దిగితే శాసనసభలోనూ టీడీపీ ఈ విషయాన్ని హైలెట్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఈ వ్యవహారంపై ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.


First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...