AP GOVERNMENT KEY DECISION ON VILLAGE SECRETARIAT AND GRAM VOLUNTEERS RECRUITMENT BA
అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు.. డీఎస్సీ ద్వారా సిబ్బంది భర్తీ
ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం సమీక్ష
Gram Volunteers | ఈ నెల 15న గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. జూలై 20 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ లోపు డీఎస్సీ లేదా స్ధానిక కమిటీలు గ్రామ సచివాలయాలలో సిబ్బంది నియామకాన్ని పూర్తి చేస్తాయి.
ఏపీలో అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్ జగన్ సర్కారు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఎంతమంది వాలంటీర్లను తీసుకోవాలి, వారిని ఏ విధంగా ఎంపిక చేయాలి, సచివాలయాల్లో ఎవరెవరు ఉండాలనే అంశంపై ఇవాళ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రతీ గ్రామ సచివాలయంలో 12 మంది సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,480 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం గ్రామ పరిపాలనా వ్యవస్ధను బలోపేతం చేసే లక్ష్యంతో ఏపీలో అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయ ఏర్పాటు చేయాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ సంబంధిత 12 శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం... రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామ వంచాయతీలు, వాటి పరిధిలో ఏర్పాటు కానున్న గ్రామ సచివాలయాల సంఖ్యను నిర్ధారించారు. దీని ప్రకారం ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 వేల 55 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 9480 గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో ఒకే గ్రామ పంచాయతీతో కూడిన గ్రామ సచివాలయాల సంఖ్య 6168 కాగా... బహుళ పంచాయతీలతో కూడిన సచివాలయ సంఖ్య 3132గా నిర్ణయించారు.
కలెక్టర్ల సదస్సులో సీఎం వైఎస్ జగన్
వైసీపీ మ్యానిఫెస్టోలో కీలకమైన నవరత్నాల అమలుకు గ్రామ సచివాలయ వ్యవస్ధ కీలక పాత్ర పోషించాల్సిన అవసరముందని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం 12 సంబంధిత శాఖల అధికారులకు వివరించారు. గ్రామంలోని 50 ఇళ్లకో గ్రామ వాలంటీర్ ను నియమిస్తామని, వారికి నెలకు 5 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వీరిని జిల్లా నియామక కమిటీలు (డీఎస్సీ) ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ఆహ్వానించిన గ్రామ వాలంటీర్ల దరఖాస్తులకు భారీ స్పందన వస్తోంది. ప్రతీ గ్రామ సచివాలయంలో 12 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిలో గ్రామ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి, మల్టీపర్పస్ వ్యవసాయ విస్తరణ అధికారి, గోపాలమిత్ర, ఎలక్ర్టికల్ లైన్ మెన్-పవర్ అసిస్టెంట్, గ్రామీణ ఇంజనీరు (ఇంజనీరింగ్ టెక్నికల్ వ్యక్తి ) వెల్పేర్ అసిస్టెంట్, శానిటేషన్ అసిస్టెంట్, ఏఎన్ఎం,-ఆశావర్కర్, మహిళా పోలీసు అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వంటి 12 మంది ఉద్యోగులు పనిచేస్తారు. వారిని ఆయా లైన్ డిపార్టమెంట్లు పర్యవేక్షించనున్నాయి.
జగన్ మోహన్ రెడ్డి సమీక్ష
ఈ నెల 15న గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. జూలై 20 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ లోపు డీఎస్సీ లేదా స్ధానిక కమిటీలు గ్రామ సచివాలయాలలో సిబ్బంది నియామకాన్ని పూర్తి చేస్తాయి. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకూ ఎంపికైన సిబ్బందికి శిక్షణ ఉంటుంది. సెప్టెంబర్ 20 నాటికి గ్రామ సచివాలయాల్లో ఫర్నిచర్ ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. సెప్టెంబర్ 25 నాటికి ఎంపికైన అభ్యర్ధులకు సచివాలయాల కేటాయింపు పూర్తవుతుంది. అనంతరం అక్టొబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు పనిచేస్తాయి.
(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్18)
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.