visakhapatnam: పరిపాలన రాజధానికి సరిపడ తాగునీరు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం

గ్రేటర్ విశాఖ కోసం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శ్రీకారం

విశాఖను పరిపాలన రాజధానిగా చేసే క్రమంలో మరో ముందడుగు వేసింది ఏపీ ప్రభుత్వం. భవిష్యత్తు విశాఖ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేందుకు భారీ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

  • Share this:
    ఏపీ పరిపాలన రాజధాని విశాఖపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా వైజాగ్ నుంచి పాలన సాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. అధికారికంగా రాజధాని సిఫ్ట్ అయ్యేలోపే అవసరాలకు సరిపడ మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్ చేస్తోంది. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ సైతం త్వరలోనే విశాఖ నుంచి పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. కోర్టు కేసుల అన్నింటీనీ అధిగిమిస్తామని ప్రకటించారు. మరోవైపు తాజాగా విశాఖ తాగునీటి అవసరాల కోసం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

    ఏలేరు రిజర్వాయర్ నుంచి 12 టీఎంసీల నీటిని తరలించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం భారీ పైప్ లైన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. దాదాపు 3 వేల 400 కోట్ల రూపాయలపైనే ఖర్చు అవుతుందని అబధికారులు లెక్కలు తేల్చారు. ఓ వైపు ప్రభుత్వం భారీ ప్రాజెక్టుపై ఫోకస్ చేస్తే.. మరోవైపు ఈ ప్రాజెక్ట్ పై అప్పుడే రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి. గ్రావిటీ ద్వారా గోదావరి జలాలు వస్తున్నప్పుడు మళ్లీ పైప్ లైన్ ఎందుకో చెప్పాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ డిమాండ్ చేస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం 2051 వరకు విశాఖకు సరిపడ తాగు నీటి అవసరాల కోసం సదుపాయాలు కల్పిస్తున్నామని చెబుతోంది. ముఖ్యంగా గ్రేటర్ విశాఖతో పాటు, మేజర్ మున్సిపాలిటీలు యలమంచిలి, నర్సీపట్నానికి తోడు వెయ్యి గ్రామాల్లో తాగునీటి అవసరాలు తీర్చడమే లక్ష్యంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టినట్టు అధికారులు చెబుతున్నారు.

    విశాఖ పరిపాలన రాజధాని అయిన తరువాత ఇక్కడ జనాభా పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగానే రాబోయే 30 ఏళ్ళల్లో జనాభా భారీగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలా అయితే తాజా లెక్కల ప్రకారం 12 టీఎంసీల మంచినీటి అవసరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏలేరు, రైవాడ, మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ పైనే ప్రస్తుతం నగరంలోని పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. మూడేళ్ళుగా గోదావరి జలాలు తరలి వస్తుండటంతో వేసవిలో నీటి ఎద్దడి తప్పింది.

    పెరుగుతున్న జనాభా, నగర పరిధి వీటికి తోడు కాబోయే పరిపాలన రాజధాని ఇలా అన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకుని పోలవరం ప్రాజెక్టు ఎగువ నుంచి విశాఖకు సుమారు 220 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం చేపట్టాలని జీవీఎంసీ ప్రతిపాదించింది. నిర్మాణ వ్యయం భారీగా ఉండటం.. అలాగే దీని నిర్మాణానికి ఆరు నెలల పాటు గోదావరి జలాలు కాలువల ద్వారా అందుబాటులోకి వస్తుండడంతో పైప్ లైన్ ప్రాజెక్టు ను కుదించాలని ప్రభుత్వం నిర్ధేశించింది. నీటిని తరలించేందుకు ఏలేశ్వరం నుంచి సుమారు 150 కిలోమీటర్లు పైప్ లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.

    ఏడాదిలో ఆరు నెలలు పోలవరం జలాలు అందుబాటులో ఉంటాయి. అలాగే కాలువల నిర్వహణ సమయంలో పైప్ లైన్ ద్వారా ఏలేరు జలాలు వాడుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. ప్రాజెక్టు అంచనా వ్యయం 3400 కోట్లు కాగా అంత మొత్తాన్ని భరించేందుకు జీవీఎంసీ సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. దీంతో 50 శాతం నిధులు ప్రధాన మంత్రి జాతీయ జల జీవన్ మిషన్ నుంచి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ పైప్ లైన్ నిర్మాణం పై టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. 365 రోజులు గోదావరి జలాలు అందుబాటులో ఉండగా.. భారీ పైప్ లైన్ నిర్మాణం వెనుక ఆంతర్యమేంటి అని ప్రశ్నిస్తోంది.
    Published by:Nagesh Paina
    First published: