ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఇప్పుడు రాజకీయ నేతలతో టెన్షన్ మొదలయ్యింది. కొందరు ముఖ్య నేతలు తమతమ నియోజకవర్గాల్లో ఓడిపోతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఆయా నేతలు ఇప్పుడు మరింత ఆందోళనలో పడిపోయారు. వైసీపీ విషయానికి వస్తే... ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా... నగరిలో ఓడిపోతారనే ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. దాదాపు ఏపీ ఎన్నికలపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో ఇదే తేలింది. లగడపాటి సర్వేతో పాటు... ఆరా అనే సంస్థ ఏపీ ఎన్నికల ఫలితాలపై చేసిన సర్వేలో రోజా ఓటమి తప్పదని తేలింది. ఆరా సర్వే ప్రకారం ఈసారి ఆమె ఓడిపోతారని తెలుస్తోంది. ఈ అంశాన్ని కొన్ని విశ్లేషణలు కూడా బలపరుస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే... జగన్ పార్టీలో రోజాకు లేడీ కోటాలో హోంమంత్రి పదవి ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. అందువల్ల కొందరు చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలే నగరిలో రోజా ఓటమికి స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది.
సొంత నియోజకవర్గంలోనే మంత్రి పదవుల్ని ఆశిస్తున్న కొందరు సీనియర్ నేతలు... రోజా గెలిస్తే తమకు మంత్రి పదవి రేసులో పోటీ వస్తుందని ఆమె ఓటమికి ఎన్నికలకు ముందే ప్రణాళికలు రచించినట్లు సమాచారం. దీంతో నగరిలో రోజాకు ఓటమి తప్పదని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద లగడపాటి సర్వేతో పాటు ఆరా సర్వే కూడా నగరిలో రోజా ఓడిపోతున్నారనే తేల్చాయి, ఇక మరో సర్వే కూడా ఇదే తేల్చింది. దీంతో ఇప్పుడు రోజా గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్‌ను గుడ్డిగా నమ్మలేమన్నారు. తన వరకు అయితే ఇలాంటి సర్వేలను నమ్మనని తేల్చేశారు. ఏపీ ప్రజలు జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు రోజా. ప్రజలతో మమేకమై వారు ఏం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకున్నామని అన్నారు.
పైకి గంభీరంగా మాట్లాడుతున్నా లోలోపల ఆమెను ఎగ్జిట్ పోల్స్ భయం వెంటాడుతుందని భావిస్తున్నారు రాజకీయ నిపుణులు. గత ఎన్నికల్లో కూడా నగరి నుంచి పోటీ చేసిన రోజా.. టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడుపై గెలుపొందారు. 2004లో నగరి, 2009లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన రోజా 2009లో ఓటమి తర్వాత వైఎస్ బతికి ఉండగానే కాంగ్రెస్‌లోకి చేరిపోయారు. వైఎస్ మరణాంతరం వైసీపీలోకి వెళ్లడంతో పాటు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేయడంతో జగన్ గత ఎన్నికల్లో ఆమెకు నగరి సీటు ఇచ్చారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.